Madhya Pradesh : స్కూల్ బస్సు మిస్.. చెట్టుకు ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య!

స్కూల్ బస్సు మిస్ అయిందని మనస్తాపంతో 14ఏళ్ల విద్యార్థి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భేతుల్ జిల్లాలో చోటుచేసుకుంది.

Student missing school bus : స్కూల్ బస్సు మిస్ అయిందని మనస్తాపంతో 14ఏళ్ల విద్యార్థి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యప్రదేశ్ భేతుల్ జిల్లాకు 40 కిలోమీటర్ల దూరంలోని ఆమ్‌దో గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆమ్‌దో గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పటిలానే బాలుడు పాఠశాల వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే అంతలోనే బస్సు మిస్ అయ్యిందని ఘోడడోంగ్రి పోలీస్ పోస్ట్ ఇన్‌ఛార్జ్ రవి శక్య తెలిపారు.

స్కూలుకు తొందరగా వెళ్లాలని బస్సు కోసం పరిగెత్తాడు. అప్పటికే బస్సు వెళ్లిపోవడంతో ఆ బాలుడు తీవ్ర మనస్తాపం చెందాడు. స్కూలుకు హాజరుకాలేకపోయానని అతడు కలత చెందాడని పోలీసు అధికారి తెలిపారు. బస్సు వెళ్లిపోయిందంటూ ఏడుస్తూ ఇంటికి తిరిగొచ్చాడని బాలుడి బంధువు ఒకరు చెప్పారు. కొంతసేపటికి ఇంటి పెరట్లోని చెట్టుకు బాలుడు ఉరివేసుకుని కనిపించినట్టు తల్లిదండ్రులు గుర్తించారు. చదువుపై అతడికి చాలా ఆసక్తి ఉండేదని అన్నారు. పాఠశాల యూనిఫాం ధరించి, పెరట్లోని మామిడి చెట్టుకు వేలాడుతూ కనిపించినట్టు తెలిపారు.

స్కూల్ హాజరుకాలేకపోయానని తమ కుమారుడు తీవ్ర మనస్తాపం చెందినట్టు తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. సాధారణంగా చాలామంది టీనేజర్లు చదువుల్లో రాణించాలని తల్లిదండ్రులు వారిని ఒత్తిడి చేస్తుంటారు. కొన్నిసార్లు ఇలాంటి తీవ్రమైన చర్యల కారణంగా పిల్లలు మానసికంగా కృంగిపోతుంటారని పిల్లల నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా ప్రభావం కూడా టీనేజ్ పిల్లలపై ఎక్కువగా ఉంటుందని, తల్లిదండ్రులు వారి ప్రవర్తననను ఎప్పటికప్పుడూ గమనిస్తుండాలని సూచిస్తున్నారు.
Read Also :  Ayyappa Mala : ప్రిన్సిపాల్ ఓవరాక్షన్.. మాల ధరించిన విద్యార్థిని స్కూలు నుంచి వెళ్ళగొట్టాడు

ట్రెండింగ్ వార్తలు