Master Card: నేటి నుంచి మాస్టర్‌కార్డ్ జారీ నిలిపివేసిన ఆర్బీఐ!
అమెరికాకు చెందిన ప్రముఖ చెల్లింపుల ఆపరేటర్ మాస్టర్‌కార్డ్ (Master Card)కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గట్టి షాక్ ఇచ్చింది. మాస్టర్ కొత్త కార్డుల జారీపై నిషేధం విధించింది. మాస్టర్ కొత్త కార్డుల జారీపై నేటి నుంచి ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.
- Naresh Mannam
- Published On : July 22, 2021 / 04:38 PM IST
Master Card
Master Card: అమెరికాకు చెందిన ప్రముఖ చెల్లింపుల ఆపరేటర్ మాస్టర్‌కార్డ్ (Master Card)కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గట్టి షాక్ ఇచ్చింది. మాస్టర్ కొత్త కార్డుల జారీపై నిషేధం విధించింది. మాస్టర్ కొత్త కార్డుల జారీపై నేటి నుంచి ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. కొత్తగా భారతీయ కస్టమర్లను ఎవరినీ చేర్చుకోవద్దని మాస్టర్ కార్డ్ సంస్థకు ఆర్బీఐ గతంలోనే ఆదేశించగా.. నేటి నుండి కొత్తగా డెబిట్, క్రెడిట్ కార్డులను జారీచేసే వీలు లేకుండా ఉత్తర్వులు ఇచ్చింది.
కొత్తగా తీసుకొనే డొమెస్టిక్ డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కస్టమర్ల కార్డులు మూడింటికి ఈ ఆంక్షలు వర్తించనున్నాయి. చెల్లింపుల సమాచారం నిల్వ (Payment systems data)కు సంబంధించిన నిబంధనలను మాస్టర్‌కార్డ్ ఉల్లంఘించినందున ఈ చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ (RBI) గతంలో ప్రకటించింది. జారీ చేసిన మాస్టర్ కార్డ్ కస్టమర్ల విషయంలో మాత్రం మాస్టర్‌కార్డ్ యథాతథంగా తమ సర్వీసులను కొనసాగించవచ్చని పేర్కొంది.
‘Payment and Settlement Systems Act, 2007 (PSS Act)’ కింద పేమెంట్ వ్యవస్థల డేటాను భారత్‌లోనే స్టోర్ చేయాలంటూ ఆర్బీఐ అన్ని పేమెంట్ సర్వీస్ సంస్థలను 2018 ఏప్రిల్‌లోనే ఆదేశించింది. ఈ మేరకు ఆయా సంస్థలకు 6 నెలల గడువు కూడా విధించగా.. మాస్టర్ కార్డ్ ఆర్బీఐ మార్గదర్శకాలను అమలు చేయలేదు. దాంతో ఆర్బీఐ మాస్టర్ కార్డుపై జారీని నిలిపివేసింది. గతంలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డైనర్స్ క్లబ్ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించగా ఈ సంస్థలపై కూడా ఆర్బీఐ ఆంక్షలు విధించగా ఇప్పుడు మాస్టర్ కార్డ్ వంతు వచ్చినట్లైంది.
