MK Stalin: సినిమాలు ఆపినా నటన ఆపలేదు.. సీఎం పోస్టుకు తగినట్లు నడుచుకోండి.. విజయ్‌పై ఎంకే స్టాలిన్ సాలిడ్ కౌంటర్
తమిళనాడు రాజకీయాల్లో సీఎంగా ఉన్న విజయ్, ప్రతిపక్ష డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin)మధ్య రాజకీయం మరింత వేడెక్కింది.
- V Santhosh Kumar
- Updated on- September 26, 2026 / 02:55 PM IST
MK Stalin makes sensational comments about Tamil Nadu CM Vijay.
MK Stalin: తమిళనాడు రాజకీయాల్లో అధికార పార్టీ టీవీకే నాయకుడు, సీఎంగా ఉన్న విజయ్, ప్రతిపక్ష డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్(MK Stalin) మధ్య రాజకీయం మరింత వేడెక్కింది. సినిమాలు చేయడం మానేశానని చెబుతున్న విజయ్, ప్రజల ముందు మాత్రం ఇంకా నటిస్తూనే ఉన్నారని మాజీ సీఎం స్టాలిన్ ఘాటుగా విమర్శించారు. మదురాంతకం అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారంలో విజయ్ మాట్లాడిన తీరును, ఆయన డైలాగ్ డెలివరీని ఎద్దేవా చేస్తూ స్టాలిన్ ‘ఎక్స్’ వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి విమర్శలు చేసేటప్పుడు విజయ్ కనీస రాజకీయ సంయమనం పాటించాలని ఆయన సూచించారు.
స్వచ్ఛమైన శక్తి వ్యాఖ్యలపై నిలదీత – పార్టీ మార్పులు, కొనుగోళ్లపై ఫైర్:
టీవీకే అనేది ఒక ‘స్వచ్ఛమైన శక్తి’ అని, డీఎంకే ‘దుష్ట శక్తి’ అని విజయ్ చేసిన వ్యాఖ్యలను స్టాలిన్ తీవ్రంగా తప్పుపట్టారు. అన్నాడీఎంకే నుంచి వచ్చిన నాయకులను పక్కన పెట్టుకుని, కూటమి నాయకులను ప్రోత్సహిస్తూ తమ పార్టీని స్వచ్ఛమైన శక్తిగా అభివర్ణించుకోవడం సీఎం విజయ్‌కే చెల్లిందని, ఇది పూర్తిగా సిగ్గుచేటని విమర్శించారు. అంతేకాకుండా డీఎంకే హయాంలో తెచ్చిన సంక్షేమ పథకాల పేర్లు మార్చి టీవీకే ప్రభుత్వం అమలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు, నిత్యావసరాల ధరల పెరుగుదల, పాల కొరత క్షీణిస్తున్న, శాంతిభద్రతల సమస్యలను పరిష్కరించడంలో విజయ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్టాలిన్ దుయ్యబట్టారు.
పోక్సో కేసు ఆరోపణలకు కౌంటర్ – కోర్టు ఆదేశాలను ప్రస్తావించిన స్టాలిన్:
జెమ్ గ్రానైట్స్ ఛైర్మన్ ఆర్.వీరమణికి సంబంధించిన పోక్సో కేసు వ్యవహారంలో డీఎంకేపై విజయ్ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ అంశంపై తాను ఇప్పటికే అసెంబ్లీలో స్పష్టమైన వివరణ ఇచ్చానని గుర్తుచేశారు. ఇలాంటి సున్నితమైన దర్యాప్తు అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని మద్రాస్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, విజయ్ ఉపఎన్నికల ప్రచారంలో దాన్ని రాజకీయం చేయడం సరికాదని మండిపడ్డారు. సీఎంగా ఉంటూ చట్టపరమైన అంశాలను ఎన్నికల లబ్ధి కోసం వాడుకోవడం ఆపాలని, ప్రజల ముందు నాటకాలు ఆడటం స్వస్తి పలకాలని హెచ్చరించారు.
