Stalin Vijay First Speech : రంగంలోకి దిగిన స్టాలిన్.. విజయ్ తొలి ప్రసంగంపై ఘాటు వ్యాఖ్యలు.. ఇక ముందుంది ముసళ్ల పండగ..!
Stalin Vijay First Speech : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం విజయ్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై మాజీ సీఎం స్టాలిన్ ఘాటుగా స్పందించారు.
- Dharani Pilli
- Updated on- May 10, 2026 / 04:13 PM IST
MK Stalin Reaction on Vijay first speech as cm oath ceremony claims Rs 10 Lakh Crore Debt
Stalin Vijay First Speech : తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తమిళ వెట్రి కజగం (TVK) అధ్యక్షుడు విజయ్ ప్రమాణ స్వీకారం అనంతరం ప్రసంగిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని.. గత ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల అప్పు మిగిల్చి ఖజానాని ఖాళీ చేసిందంటూ విమర్శించారు. సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆరోపణలను తిప్పికొట్టారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్టాలిన్ ఒక పోస్ట్ చేశారు. దీనిలో తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ కి శుభాకాంక్షలు చెబుతూనే ఆయన చేసిన ఆరోపణలను ఖండించారు.
స్టాలిన్ ఎక్స్ లో ‘గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తమిళ వెట్రి కజగం (TVK) అధ్యక్షుడు విజయ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే మీరు సంతకం చేసిన ప్రకటనలను కూడా నేను స్వాగతిస్తున్నాను. అయితే, బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రభుత్వం వద్ద డబ్బు లేదని మాట్లాడకండి. నిధులు ఉన్నాయి. ప్రజలకు అందించాలనే మనసు, పాలనా దక్షత ఉంటే చాలు’.
*సీఎంగా ప్రమాణం తరువాత విజయ్ పొలిటికల్ స్పీచ్‌లో 10 పంచ్ డైలాగ్స్ ఇవే..
‘గత ఐదేళ్లలో కోవిడ్, వరదలు వంటి అనేక సవాళ్లను మరియు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ పక్షపాత వైఖరిని తట్టుకుని మేము లెక్కలేనన్ని ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేశాము. ‘గత ప్రభుత్వం రూ. 10 లక్షల కోట్ల అప్పు మిగిల్చి, ఖజానాను ఖాళీ చేసి వెళ్ళింది’ అని మీ మొదటి ప్రసంగంలోనే విమర్శించారు. కానీ, తమిళనాడు అప్పులు అనుమతించబడిన పరిమితుల్లోనే ఉన్నాయి’.
‘తమిళనాడు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై గత ఫిబ్రవరి బడ్జెట్‌లోనే మేము స్పష్టంగా చెప్పాము. అది మీకు తెలియదా.. అది తెలిసిన తర్వాతే కదా మీరు ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చారు.. ఇప్పుడు మీకు ఓటు వేసిన ప్రజలను మళ్ళీ మోసం చేసి, వారిని తప్పుదోవ పట్టించకండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“సాధ్యమయ్యే హామీలను మాత్రమే ఇస్తున్నాను” అని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు ఇప్పుడే ప్రభుత్వ పరిపాలనలోకి అడుగుపెడుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలనే మెళకువలను త్వరలోనే మాలాగే మీరు కూడా ఖచ్చితంగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. మీకు ఓటు వేసిన ప్రజలతో పాటు, నేను కూడా దాన్నే ఆశిస్తున్నాను. మీ పాలనలో తమిళనాడు అభివృద్ధి ప్రయాణం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ.. మరోసారి నా అభినందనలు’’ అంటూ పోస్ట్ చేశారు.
