Mysuru Dasara Royal Family Dispute : మైసూర్ రాజమాత vs కర్ణాటక ప్రభుత్వం.. దసరా పెట్టిన చిచ్చు.. అసలేంటి ఈ వివాదం..?

Mysuru Dasara Royal Family Dispute : మైసూరు దసరా ఉత్సవాల నిర్వహణపై రాజకుటుంబం, కర్ణాటక ప్రభుత్వం మధ్య వివాదం ముదిరింది. బంగారు అంబారి, రాజప్రాసాదం యాజమాన్యం, సంప్రదాయాలపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Mysuru Dasara Royal Family Dispute

Mysuru Dasara Royal Family Dispute : మైసూరు దసరా వేడుకలు రాజకుటుంబం, కర్ణాటక ప్రభుత్వం మధ్య ఆధిపత్య పోరుకు వేదికగా మారాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన రాజ సంప్రదాయాలపై ప్రభుత్వ జోక్యం పెరుగుతోందంటూ రాజమాత ప్రమోదాదేవి వడియార్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. మరోవైపు రాజకుటుంబం వాదనలను ప్రభుత్వం తోసిపుచ్చడంతో వివాదం మరింత ముదిరింది. బంగారు అంబారి నుంచి విజయదశమి ఊరేగింపు వరకు.. ప్రతి అంశం ఇప్పుడు అధికారాలు, హక్కులు, సంప్రదాయాల చుట్టూ చర్చకు దారితీస్తోంది. అసలు మైసూరు దసరాపై హక్కు ఎవరిది? రాజకుటుంబ సంప్రదాయాలకే ప్రాధాన్యమా.. ప్రభుత్వ నిర్వహణకే అధికారం ఉందా? ఈ వివాదం వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం.

Also Read : Gold Silver Prices Today : ధనత్రయోదశి.. బంగారం ప్రియులకు శుభవార్త.. ఏపీ, తెలంగాణలో గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే..

కర్ణాటకలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మైసూరు దసరా ఉత్సవాల నిర్వహణపై కొత్త వివాదం మొదలైంది. దసరా వేడుకల్లో తమ సంప్రదాయాలు, మతపరమైన ఆచారాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ మైసూరు మాజీ రాజకుటుంబం కర్ణాటక ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉత్సవాల నిర్వహణలో అధికారుల సమన్వయ లోపం, పోలీసుల వ్యవహారశైలి, రాజకుటుంబ ఆచారాల్లో జోక్యం వంటి అంశాలపై రాజమాత ప్రమోదా దేవి వడయార్ తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. అంతేకాకుండా మైసూరు రాజప్రాసాదం యాజమాన్యం, దసరా ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వానికి, రాజకుటుంబానికి మధ్య ఉన్న పాత వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

వందల ఏళ్ల నుంచి దసరా చరిత్ర..
మైసూరులో జరిగే దసరా వేడుకలకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. 1610 నుంచి ఈ వేడుకలు కొనసాగుతున్నాయి. అప్పట్లో వడయార్ రాజవంశానికి చెందిన రాజా వడయార్ విజయనగర సామ్రాజ్య సంప్రదాయాలను అనుసరిస్తూ శ్రీరంగపట్నంలో దసరా వేడుకలను ప్రారంభించారు. అప్పటి నుంచి మహారాజులే ఈ ఉత్సవాలకు నాయకత్వం వహించేవారు. బంగారు అంబారిపై ఊరేగింపులో పాల్గొనేవారు. 1970లో అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి మాజీ పాలకుల గుర్తింపును రద్దు చేయడంతో రాజవంశం నిర్వహించే సంప్రదాయాల్లో మార్పులు వచ్చాయి. అనంతరం రాజకుటుంబం తన ఆచారాలను రాజప్రాసాదంలోని దర్బార్ హాలుకు పరిమితం చేసింది. 1970 దశకంలో దేవరాజ్ ఉర్స్ ప్రభుత్వం దసరా ఊరేగింపు నిర్వహణ బాధ్యతలను చేపట్టింది. అప్పటి నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్ర పండుగగా మైసూరు దసరా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒకే ప్రాంగణంలో రెండు వేర్వేరు సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. ఒకటి కర్ణాటక ప్రభుత్వం నిర్వహించే రాష్ట్ర పండుగ ‘నాడ హబ్బ’. మరొకటి మైసూరు రాజకుటుంబం నిర్వహించే ప్రైవేటు దసరా ‘ఖాసగి’. రాజకుటుంబ పెద్ద ఆధ్వర్యంలో రాజప్రాసాదంలోని దర్బార్ హాలులో ప్రత్యేక పూజలు, సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ రెండు వేడుకల నిర్వహణలో ప్రభుత్వ అధికారుల జోక్యం పెరుగుతోందని రాజకుటుంబం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

లేఖపై వివాదం..
మైసూరు రాజకుటుంబానికి చెందిన రాజమాత ప్రమోదా దేవి వడయార్ నాలుగు పేజీల బహిరంగ లేఖ విడుదల చేశారు. పలు అంశాలపై లేఖలో ప్రస్తావించారు. ఊరేగింపు ముగిసిన తర్వాత అంబారిని తిరిగి తీసుకెళ్లేందుకు వచ్చిన రాజకుటుంబ ప్రతినిధులతో కొందరు పోలీసులు దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నారు. కుటుంబానికి కేటాయించిన పార్కింగ్ ప్రాంతంలోనూ పోలీసు వాహనాలను నిలిపారని ఆరోపించారు. ఇదే సమయంలో దసరా నిర్వహణలో సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. వీటిలో ప్రధానమైంది.. ప్రభుత్వ సాంస్కృతిక కార్యక్రమాలను దసరా మొదటి ఏడు రోజులకే పరిమితం చేయాలి. ప్రభుత్వ సాంస్కృతిక కార్యక్రమాలను దసరా మొదటి ఏడు రోజులకే పరిమితం చేయాలి. ఆయుధ పూజ, విజయదశమి రోజుల్లో రాజప్రాసాదాన్ని పూర్తిగా రాజకుటుంబ సంప్రదాయ కార్యక్రమాలకే కేటాయించాలి. చాముండేశ్వరి అమ్మవారి బంగారు అంబారి ఊరేగింపును విజయదశమి రోజుకు బదులుగా చాముండి కొండపై జరిగే అమ్మవారి రథోత్సవం రోజున నిర్వహించాలని సూచించారు. అయితే, మొత్తంగా తమ కుటుంబం నిర్వహించే ప్రైవేటు దసరాకు ప్రభుత్వ వేడుకలతో సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. సంప్రదాయాల పరిరక్షణ విషయంలో అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.

ప్రభుత్వం వాదన ఏమిటంటే?
రాజకుటుంబం చేసిన ప్రతిపాదనలను కర్ణాటక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, మైసూరు జిల్లా ఇన్‌చార్జి యతీంద్ర సిద్ధరామయ్య అంగీకరించలేదు. మైసూరు రాజప్రాసాదం, దాని పరిసరాలు, ప్యాలెస్ బోర్డు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. రాజకుటుంబానికి గౌరవప్రదంగా నివసించేందుకు కొంత స్థలం కేటాయించామని తెలిపారు. ప్రభుత్వం నిర్వహించే దసరాకు కూడా ప్రత్యేక చరిత్ర ఉందని, 1971 నుంచి రాష్ట్ర పండుగగా వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏవైనా సమస్యలు ఉంటే ముందుగా ప్రభుత్వానికి తెలియజేయాలని, మీడియా ద్వారా బహిరంగంగా లేఖ విడుదల చేయడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. రాజకుటుంబం చేసిన అన్ని సూచనలను అంగీకరించడం సాధ్యం కాదని, అయితే సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

అసలు వివాదం ఇదే..
మైసూరు దసరా జంబూ సవారీలో ప్రధాన ఆకర్షణ చాముండేశ్వరి అమ్మవారిని ఊరేగించే బంగారు అంబారి. సుమారు 750 కిలోల బరువున్న ఈ అంబారి ఇప్పటికీ రాజకుటుంబం ఆధీనంలోనే ఉంది. విజయదశమి రోజున ఏనుగుపై దీనిని ఉంచి ఊరేగింపు నిర్వహిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం రాజకుటుంబానికి ఏటా లక్షల రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తోంది. అంబారి తమ కుటుంబానికి చెందిన వ్యక్తిగత ఆస్తి అని ప్రమోదా దేవి స్పష్టం చేశారు. దాని భద్రతకు సంబంధించి ప్రభుత్వానికి బాధ్యతలు అప్పగించినప్పటికీ, ఈసారి నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. అంతేకాకుండా అంబారిని మోసే ఏనుగు ఎంపిక వివరాలను కూడా చివరి నిమిషం వరకు తమకు తెలియజేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో అంబారిని ప్రభుత్వానికి అందించడంపై పునరాలోచించాల్సి వస్తుందని హెచ్చరించారు.

న్యాయస్థానంలో కొనసాగుతున్న వివాదం..
దసరా ఉత్సవాల వివాదంతో పాటు మైసూరు రాజప్రాసాదం యాజమాన్యంపై దశాబ్దాలుగా కొనసాగుతున్న న్యాయపోరాటం మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. 1950లో కేంద్ర ప్రభుత్వం, అప్పటి మహారాజు జయచామరాజేంద్ర వడయార్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రాజప్రాసాదం తమ కుటుంబానికి చెందిన వ్యక్తిగత ఆస్తి అని రాజకుటుంబం వాదిస్తోంది. అయితే 1998లో అమల్లోకి వచ్చిన మైసూరు ప్యాలెస్ (అక్విజిషన్ అండ్ ట్రాన్స్‌ఫర్) చట్టం ప్రకారం రాజప్రాసాదం ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిందని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ రాజకుటుంబం దాఖలు చేసిన పిటిషన్ న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ సంస్థ అయిన మైసూరు ప్యాలెస్ బోర్డు రాజప్రాసాద నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. రాజకుటుంబం మాత్రం అందులోని కొంత భాగంలో నివసిస్తోంది.

మొత్తంగా మైసూరు దసరా ఉత్సవాల నిర్వహణపై మొదలైన వివాదం ఇప్పుడు కేవలం ఆచారాలు, ఏర్పాట్లకే పరిమితం కాకుండా రాజప్రాసాదం యాజమాన్యం, బంగారు అంబారి హక్కులు, ప్రభుత్వ అధికారాలు వంటి కీలక అంశాలకు విస్తరించింది. రాజకుటుంబం తన సంప్రదాయాల పరిరక్షణకు పట్టుబడుతుండగా, ప్రభుత్వం మాత్రం దసరా రాష్ట్ర పండుగగా కొనసాగుతుందని స్పష్టం చేస్తోంది. ఈ వివాదానికి చర్చల ద్వారా పరిష్కారం లభిస్తుందా? లేక న్యాయపోరాటం మరింత ముదురుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.