Nashik TCS Case : నాసిక్ TCS కేసులో దారుణాలు.. పాస్‌వర్డ్‌లలో అసభ్య పదజాలం.. వాట్సాప్ గ్రూపుల్లో అశ్లీల సందేశాలు
Nashik TCS Case : నాసిక్ టీసీఎస్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
- Dharani Pilli
- Published on- April 23, 2026 / 06:32 PM IST
Nashik tcs case Vulgar Passwords Obscene WhatsApp Messages
Nashik TCS Case : నాసిక్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) బీపీఓ యూనిట్‌లో వెలుగుచూసిన లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణల కేసులో రోజులు గడుస్తున్న కొద్ది విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కంపెనీ యూనిట్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌లు, వైఫై పాస్‌వర్డ్‌లలో “అశ్లీల పదజాలం” వినియోగించారని.. అలానే మహిళా ఉద్యోగినిలను మానసికంగా వేధించడానికి వాట్సాప్ గ్రూపుల్లో అశ్లీల సందేశాలు పంపడం వంటివి జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
తాజాగ ఓ బాధితురాలు మహారాష్ట్ర రాష్ట్ర మహిళా కమిషన్ ముందు తన వాంగ్మూలాన్ని నమోదు చేస్తూ.. తాను ట్రైనింగ్ లో జాయిన్ అయిన దగ్గర నుంచే ఈ వేధింపులు మొదలయ్యాయని వెల్లడించింది. అంతేకాక నిందిలు ప్రవర్తన గురించి బాధితురాలు తన పై అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, పైగా వేధింపులు మరింత ఎక్కువయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత డానిష్ షేక్, తౌసిఫ్ అత్తార్ అనే మరో ఇద్దరు నిందితులు తనను డిజిటల్‌గా వేధించడమే కాకుండా, తన గురించి పుకార్లు వ్యాప్తి చేశారని ఆమె చెప్పుకొచ్చింది.
పోలీసుల విచారణ ప్రకారం, ఈ వేధింపులు కేవలం వ్యక్తిగత సంభాషణలకు మాత్రమే పరిమితం కాలేదు. నాసిక్ టీసీఎస్ యూనిట్‌కు చెందిన ఒక గ్రూప్ లీడర్ అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో ప్రతిరోజూ అసభ్యకరమైన మెసేజ్‌లు పంపేవారని విచారణలో వెల్లడైంది. అలానే మహిళా ఉద్యోగులను మానసిక భయభ్రాంతులకు గురిచేసే లక్ష్యంతో, ఆఫీసు వైఫై (Wi-Fi) పాస్‌వర్డ్‌లను తరచుగా మారుస్తూ.. వాటిలో అశ్లీల పదాలను లేదా వారి మతపరమైన నమ్మకాలను కించపరిచే పదాలను ఉపయోగించినట్లు బాధితులు తెలిపారు.
అసలేం జరిగిందంటే..
2022లో డానిష్ షేక్ అనే వ్యక్తి, తనకు అప్పటికే వివామం అయిన విషయాన్ని దాచిపెట్టి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. దీని గురించి బాధితురాలు ఫిర్యాదు రావడంతో ఈ దారుణాలు తెర మీదకు వచ్చాయి.. ప్రస్తుతం పరారీలో ఉన్న డానిష్ సోదరి నిదా ఖాన్, బాధితురాలి మతాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడమే కాకుండా మతం మారాలని ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. డానిష్‌కు పెళ్లయిందన్న విషయాన్ని నిదా ఖాన్, తౌసిఫ్ అక్తర్‌లు బాధితురాలి వద్ద దాచిపెట్టారు.
పోలీసుల దర్యాప్తు ముమ్మరం కావడంతో, మరో ఏడుగురు మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి తమ సీనియర్లు చేసిన లైంగిక, మానసిక వేధింపుల గురించి ఫిర్యాదు చేశారు. హెచ్‌ఆర్ (HR) విభాగం కూడా తమ మొరను పట్టించుకోలేదని వారు ఆరోపించారు. ఈ ఘటనలన్నీ ఫిబ్రవరి 2022 నుండి మార్చి 2026 మధ్య కాలంలో జరిగాయి. అలాగే, ఒక పురుష ఉద్యోగి కూడా పని ప్రదేశంలో మత మార్పిడికి ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో ఇప్పటివరకు ఆరుగురు పురుషులు మరియు ఒక మహిళా హెచ్‌ఆర్ హెడ్‌తో కలిపి మొత్తం ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని డానిష్ షేక్, తౌసిఫ్ అత్తార్, రజా రఫీక్ మెమన్, షారుఖ్ ఖురేషి, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సారీ మరియు హెచ్‌ఆర్ హెడ్ అశ్విని చైనానీగా గుర్తించారు. ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే కంపెనీ వీరిని సస్పెండ్ చేసింది. నిదా ఖాన్‌పై మతపరమైన వేధింపుల కేసు నమోదైంది.
