Traffic Challan Rules : వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఎక్స్‌ప్రెస్‌వేలపై 120 కి.మీ. వేగంతో దూసుకెళ్తున్నారా? కానీ..

Traffic Challan Rules : భారతీయ హైవేల భవిష్యత్తుపై సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్స్‌ప్రెస్‌వేలపై గంటకు 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వారికి ఎలాంటి నోటీసులు జారీ చేయవద్దని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

Nitin Gadkari key Statement no speed challans should be issued up to 120 kmph on expressways

Traffic Challan Rules : హైవేలపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక విషయం వెల్లడించారు. ఇకపై ఎక్స్‌ప్రెస్‌వేలపై గంటకు 120 కిలోమీటర్ల వేగం వరకు ప్రయాణించే వాహనదారులకు స్పీడ్ చలాన్లు పంపించవద్దని అధికారులకు సూచించినట్లు తెలిపారు. అంతేకాదు.. నిర్ణీత వేగ పరిమితిని మరో 20 శాతం వరకు మించినా చలాన్లు జారీ చేయవద్దని చెప్పారు. ఆ పరిమితిని దాటినప్పుడే జరిమానా విధించాలని సూచించారు.

Also Read : Crores Cash Found : వామ్మో.. మూడు డ్రమ్ములో రూ.500 నోట్ల కట్టలు.. పోలీసులకే దిమ్మతిరిగింది.. అసలు కథ ఇదే..

భారతీయ హైవేల భవిష్యత్తుపై సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ – ముంబై వంటి ఎక్స్‌ప్రెస్ వేలపై ప్రయాణించే వాహనాల డ్రైవర్లకు జారీఅయ్యే అనవసర స్పీడింగ్ నోటీసుల సమస్యను తగ్గించే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఆయా ఎక్స్‌ప్రెస్‌వేలపై వేగ పరిమితి ప్రస్తుతం గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. స్పీడ్ కారణంగా కొంత మంది నోటీసులు అందుకుంటున్నారు. గంటకు 120 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వారికి ఎలాంటి నోటీసులు జారీ చేయవద్దని అధికారులను ఆదేశించాం. 120 కిలోమీటర్లకు మించి 20శాతం దాటినా మినహాయిస్తున్నాం. అయితే, అంతకంటే వేగం దాటితే.. చలాన్లు వేయాలని సూచించామని తెలిపారు. కేంద్ర మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. 120 కిలోమీటర్లు వేగపరిమితి ఉన్న రహదారిపై గంటకు 144 కిలోమీటర్ల వేగం వరకూ చలాన్ల పడవని చెప్పొచ్చు.

మరోవైపు దేశంలోని జాతీయ రహదారులపై ట్రాఫిక్ నియంత్రణను మెరుగుపరిచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఏటీఎంఎస్) తీసుకురావాలని గడ్కరీ సూచించారు. ఈ వ్యవస్థ ద్వారా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్నారా? లేన్ డిసిప్లిన్‌ను అనుసరిస్తున్నారా? అనే విషయాలను గుర్తించవచ్చు. ముఖ్యంగా బస్సులు, లారీలు, కార్ల డ్రైవర్లు సరైన లేన్‌లో ప్రయాణిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే, ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. ప్రతి రహదారిపై వాహనాల రకాన్ని బట్టి వేగ పరిమితులు మారుతుంటాయి. ఆయా మార్గాల్లో ఏర్పాటు చేసిన వేగ పరిమితి బోర్డులను వాహనదారులు తప్పనిసరిగా పాటించాలి. గడ్కరీ వ్యాఖ్యలను అన్ని హైవేలపై వేగ పరిమితులు మారినట్లుగా భావించకూడదు.