Chennai Metro Phase 2 : చెన్నై మెట్రో ఫేజ్‌-2 ప్రారంభం.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం!

Chennai Metro Phase 2 : చెన్నై మెట్రో రెండో దశలో పూనమల్లి–వడపళని మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సీఎం విజయ్‌తో కలిసి మెట్రోలో ప్రయాణించారు.

Chennai Metro Phase 2

Chennai Metro Phase 2 : చెన్నై నగర ప్రజలకు కీలకమైన రవాణా సదుపాయం అందుబాటులోకి వచ్చింది. చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశలో భాగంగా పూనమల్లి–వడపళని మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు సీఎం విజయ్ తో కలిసి ఆదివారం ప్రారంభించారు. అనంతరం మోదీ, విజయ్‌ కలిసి పోరూర్ బైపాస్‌ మెట్రో స్టేషన్‌ నుంచి పూనమల్లి బైపాస్‌ స్టేషన్‌ వరకు మెట్రోలో ప్రయాణించారు.

Also Read : Nepal Flash Floods : నేపాల్‌లో మళ్లీ ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన ఇళ్లు.. వీడియో వైరల్

సుమారు రూ.4,900 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ మార్గం 14.64 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. చెన్నై పశ్చిమ శివారు ప్రాంతాలను నగరంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడంలో ఇది కీలకంగా మారనుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు ఈ మార్గం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇందులో 3.7 కిలోమీటర్ల డబుల్‌ డెక్కర్‌ నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఈ కారిడార్‌లో మొత్తం 17 స్టేషన్లు ఉండగా, ప్రారంభ దశలో 11 స్టేషన్లలో మాత్రమే ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. మిగిలిన ఆరు స్టేషన్లు డబుల్‌ డెక్కర్‌ నిర్మాణ విభాగంలో ఉండటంతో తొలుత వాటిని అందుబాటులోకి తీసుకురావడం లేదు. భవిష్యత్తులో డ్రైవర్‌లెస్‌ రైళ్ల నిర్వహణకు వీలుగా అధునాతన సిగ్నలింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

ఇదిలాఉంటే.. మోదీ చెన్నై పర్యటనలో భాగంగా తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా రూ.13,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఇందులో సుమారు రూ.3,700 కోట్ల జాతీయ రహదారి పనులు, రూ.750 కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులు, పోర్టుల ఆధునికీకరణ పనులు ఉన్నాయి. చెన్నై ఐఐటీలోని సుధా గోపాలకృష్ణన్‌ బ్రెయిన్‌ సెంటర్‌ను జాతికి అంకితం చేయడంతో పాటు, విద్యా రంగానికి సంబంధించిన కార్యక్రమాల్లోనూ ప్రధాని పాల్గొన్నారు.