Womens Reservation Bill 2026: దేశ చరిత్రలో ఇదొక కీలక ఘట్టం, మహిళా బిల్లును వ్యతిరేకిస్తే సుదీర్ఘ కాలం శిక్షను అనుభవిస్తారు- ప్రధాని మోదీ

30ఏళ్ల ముందు ఆమోదం పొందాల్సిన బిల్లు.. ఇప్పుడు సభ ముందుకు వచ్చిందన్నారు. ఇది రాజకీయ పార్టీల కోసం తెచ్చింది కాదని, ప్రజల కోసం తెచ్చిన బిల్లు అని మోదీ అన్నారు.

  • Updated on- April 16, 2026 / 05:05 PM IST
  • బిల్లుకు మద్దతిచ్చే పార్టీలకే రాజకీయ మనుగడ
  • తమకు అన్యాయం చేసిన వారిని మహిళలు సమయం చూసి దెబ్బకొడతారు
  • మహిళా రిజర్వేషన్ల బిల్లు ఎవరి పట్ల వివక్ష చూపదు
  • దేశానికి మేలు చేసే విషయంలో సభ్యులంతా కలవాలి

Womens Reservation Bill 2026: మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ లోక్ సభలో మాట్లాడారు. దేశ చరిత్రలో కొన్ని కీలక ఘట్టాలు ఉంటాయన్న ప్రధాని మోదీ.. మహిళా రిజర్వేషన్ల బిల్లు కూడా దేశ చరిత్రలో గొప్ప బిల్లు అని అన్నారు. దేశ చరిత్రలో ఇదొక కీలక ఘట్టం అన్నారు. దేశ పార్లమెంట్ చరిత్రలో ఈ రోజును మరిచిపోలేమని వ్యాఖ్యానించారు. ఈ చారిత్రక సమయంలో పాలుపంచుకోవటం నా అదృష్టం అన్నారు. దేశ రాజకీయాల్లో మహిళల పాత్ర కీలకం అన్నారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తే దేశానికి సరికొత్త మార్గం చూపుతారని అన్నారు.

30ఏళ్ల ముందు ఆమోదం పొందాల్సిన బిల్లు..

30ఏళ్ల ముందు ఆమోదం పొందాల్సిన బిల్లు.. ఇప్పుడు సభ ముందుకు వచ్చిందన్నారు. 30 ఏళ్లు ప్రయత్నాలు జరిగినా మహిళా రిజర్వేషన్లు సాకారం కాలేదన్నారు. వికసిత్ భారత్ అంటే రోడ్లు, రైళ్లు, మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే కాదు.. మహిళల స్వావలంబన ఉంటేనే అది సంపూర్ణ వికసిత్ భారత్ అని అన్నారు. ఈ బిల్లును తేవటంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. ఇది రాజకీయ పార్టీల కోసం తెచ్చింది కాదని, ప్రజల కోసం తెచ్చిన బిల్లు అని మోదీ అన్నారు. 30 ఏళ్ల క్రితమే మహిళా బిల్లు తెచ్చామంటున్నారు.. మరి ఎవరికైనా మేలు జరిగిందా? అని ప్రధాని మోదీ ప్రశ్నించారు.

”తమకు అన్యాయం చేసిన వారిని మహిళలు సమయం చూసి దెబ్బకొడతారు. మహిళలు తమ హక్కుల కోసం 30ఏళ్లుగా గొంతు విప్పుతున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును దేశ ప్రజలంతా స్వాగతిస్తున్నారు. మహిళలకు నిర్ణయాధికారం ఉండాలనేది మా లక్ష్యం. మహిళా బిల్లుకు పార్టీలన్నీ ఏకగ్రీవంగా మద్దతివ్వాలి. బిల్లుకు మద్దతిచ్చే పార్టీలకే రాజకీయ మనుగడ. రిజర్వేషన్లు అనేవి మహిళల హక్కు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ఎవరి పట్ల వివక్ష చూపదు. ఈ బిల్లుతో మోదీకి లాభం జరుగుతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు క్రెడిట్ మాకు అవసరం లేదు. ఈ క్రెడిట్ అన్ని పార్టీలకు దక్కుతుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై అన్ని పార్టీల ఫోటోలు వేసుకోండి.

బిల్లును అడ్డుకోకుండా సహకరించి మీ గొప్పదనం చాటుకోండి. దేశానికి హాని చేసే, నష్టం కలిగించే అంశాలను సభ్యులంతా ఖండించాలి. పంచాయతీల్లో మహిళా రిజర్వేషన్లకు అందరూ అంగీకరించారు. మహిళల్లో రాజకీయ చైతన్యం పెరిగింది. అత్యున్నత చట్టసభల్లో ప్రాతినిధ్యాన్ని మహిళలు కోరుకుంటున్నారు. చీపురు పని కాదు, పార్లమెంటులో సీట్లు కావాలంటున్నారు. ఇప్పుడు మహిళా బిల్లును వ్యతిరేకిస్తే సుదీర్ఘ కాలం శిక్షను అనుభవిస్తారు. దేశ ప్రగతిలో మహిళలకు భాగస్వామ్యం కల్పించాల్సిందే. దేశానికి మేలు చేసే విషయంలో సభ్యులంతా కలవాలి” అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

131వ రాజ్యాంగ చట్టసవరణ బిల్లు, మహిళా రిజర్వేషన్ల బిల్లు, నియోజకవర్గాల పునర్ విభజన బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. 131వ రాజ్యాంగ చట్ట సవరణ బిల్లును అర్జున్ సింగ్ మేఘవాల్ ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్ బిల్లును హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. మూడు కీలక బిల్లులపై లోక్ సభలో చర్చ జరుగుతోంది.