Makhanlal Sarkar : సువేందు ప్రమాణస్వీకారంలో అందరి ముందు ఈ పెద్దాయన కాళ్లు మొక్కిన పీఎం మోదీ.. ఎవరీయన?
Makhanlal Sarkar : ప్రధాని మోదీ 98ఏళ్ల బీజేపీ సీనియర్ కార్యకర్త మఖన్‌లాల్ సర్కార్‌ను శాలువాతో సత్కరించి ఆయన కాళ్లకు నమస్కారం చేశారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Harish Thanniru
- Updated on- May 9, 2026 / 01:36 PM IST
Makhanlal Sarkar
- బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం
- ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రధాని మోదీ
- మఖన్‌లాల్ సర్కార్ కాళ్లకు నమస్కారం చేసిన ప్రధాని
Makhanlal Sarkar : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్‌సింగ్‌తోపాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం ఆధిత్యనాథ్ తో పాటు పలు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. అయితే, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ 98ఏళ్ల బీజేపీ సీనియర్ కార్యకర్త మఖన్‌లాల్ సర్కార్‌ను శాలువాతో సత్కరించి ఆయన కాళ్లకు నమస్కారం చేశారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో మఖన్‌లాల్ ఎవరు.. ఆయన గతంలో ఏం చేశారనే అంశాన్ని తెలుసుకొనేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.
Also Read : Gold Silver Price Today : బంగారం ధరలు తగ్గుతున్నాయ్.. వరుసగా రెండోరోజు ఢమాల్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
మఖన్‌లాల్ సర్కార్ పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తొలితరం కార్యకర్తల్లో ఒకరు. సిలిగురి నివాసి. 1952లో కాశ్మీర్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి శామ్ ప్రసాద్ ముఖర్జీతో కలిసి కాశ్మీర్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన అరెస్టు కూడా అయ్యారు. 1980లో బీజేపీ ఆవిర్భావం తరువాత ఉత్తర బెంగాల్ ప్రాంతంలో పార్టీ బలోపేతానికి మఖన్‌లాల్ సర్కార్ కీలకంగా పనిచేశారు. పశ్చిమ దినాజ్ పూర్, జల్పాయిగురి, డార్జిలింగ్ జిల్లాలకు సంస్థాగత సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టి, కేవలం ఏడాది కాలంలోనే దాదాపు పదివేల మంది సభ్యులను చేర్పించారు. సాధారణంగా ఏ నాయకుడూ ఒకే పదవిలో రెండేళ్లకు మించి ఉండని ఆ కాలంలో మఖన్ లాల్ 1981 నుంచి వరుసగా ఏడేళ్లు జిల్లా అధ్యక్షుడిగా సేవలందించారు.
బెంగాల్ బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో ఢిల్లీ పోలీసులు మఖన్ లాల్ ను అరెస్టు చేశారు. దేశభక్తి గీతం పాడినందుకు ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. అయితే, కోర్టులో క్షమాపణలు చెప్పాలని కోరినా మఖన్ లాల్ అందుకు ఒప్పుకోలేదు. నేను ఎలాంటి నేరం చేయలేదు.. కేవలం ఒక పాటమాత్రమే పాడానంటూ న్యాయమూర్తికి వివరించారు. దీంతో ఆ పాటను మళ్లీ పాడాలంటూ న్యాయమూర్తి కోరడంతో.. కోర్టులోనే మళ్లీ ఆ పాటపాడి వినిపించారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఫస్ట్ క్లాస్ టికెట్ ఏర్పాటు చేసి, ప్రయాణ ఖర్చుల కోసం రూ. 100 మఖన్ లాల్‌కు ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.
మఖన్ లాల్ పార్టీ సిద్ధాంతాల కోసం నిర్విరామంగా కృషి చేశాడు. తాజాగా.. బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మఖన్ లాల్ సర్కార్ ను ప్రధాని నరేంద్ర మోదీ శాలువాతో సత్కరించి, అతని కాళ్లకు నమస్కారం చేశారు. దీంతో మోదీ తీరు పట్ల నెటిజన్లు, బీజేపీ శ్రేణులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
