PM Modi Video Conference : కరోనా కట్టడి బాధ్యత మీదే : ప్రధాని మోడీ

రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ అన్నారు. కరోనా వల్ల మరోసారి సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

  • Updated on- April 8, 2021 / 09:35 PM IST

Modi Video Conference

PM Modi video conference with state CMs on Corona‌ : రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ అన్నారు. కరోనా వల్ల మరోసారి సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆర్థిక వ్యవస్థపై రాజీ పడలేమని చెప్పారు. పలు రాష్ట్రాల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యలు.. వ్యాక్సినేషన్‌.. విధివిధానాల గురించి సీఎంలతో చర్చించారు. పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ లేదని సంకేతాలిచ్చారు.

వ్యాక్సినేషన్‌ కన్నా టెస్టింగులకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ప్రధాని. కొన్ని రాష్ట్రాల్లో టెస్టింగ్‌ల సంఖ్య భారీగా పెంచాలన్నారు. ఫస్ట్‌ వేవ్‌ను మనం జయించాం సెకండ్‌ వేవ్‌ను కూడా జయించగలమని ధీమా వ్యక్తం చేశారు. చిన్న చిన్న కంటైన్‌మెంట్‌ జోన్స్ తప్పనిసరని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు.

70 శాతం ఆర్టీపీసీఆర్ టెస్టులు లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టు కోసం శాంపిల్స్ సరిగా తీసుకోవడం లేదన్నారు. వ్యాక్సిన్ వృథా కాకుండా చూడాలన్నారు. వచ్చే మూడు వారాలు భారత్ కు కీలకమన్నారు. ఈ నెల 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కాన్ఫరెన్స్‌లో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌, హోంమంత్రి అమిత్‌ షా కూడా పాల్గొన్నారు. భారత్‌లో తొలిసారి లక్షా 26వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కొన్ని ఆంక్షలు విధించారు. రాత్రి పూట లాక్‌డౌన్‌, కర్ఫ్యూ విధించారు.