Free Gas Connection: మహిళలకు కేంద్రం గుడ్ న్యూస్.. ఉచిత గ్యాస్ కనెక్షన్.. స్టవ్, సిలిండర్ కూడా.. దరఖాస్తు గడువు పెంపు!
ఫ్రీ గ్యాస్ కనెక్షన్స్(Free Gas Connection) పై దేశంలో ఉన్న మహిళలకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.
- V Santhosh Kumar
- Published on- October 8, 2026 / 04:47 PM IST
PM Ujjwala Yojana 2.0 Application process for free LPG connection and subsidy details
దేశంలోని పేద కుటుంబాల మహిళలకు ఆసరాగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0’ పథకం గడువును పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కట్టెల పొయ్యి పొగ నుంచి మహిళల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ద్వారా అర్హులైన మహిళలకు పూర్తి ఉచితంగా గ్యాస్ కనెక్షన్‌తో పాటు తొలి సిలిండర్ మరియు పొయ్యి అందజేస్తారు. 18 ఏళ్లు నిండి, బీపీఎల్ కార్డు కలిగి ఉన్న మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇప్పటివరకు కుటుంబంలో ఎవరి పేరిటా గ్యాస్ కనెక్షన్ లేనివారు ఆధార్, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
సిలిండర్ రీఫిల్‌పై రూ.300 సబ్సిడీ.. ప్రభుత్వం కొత్త నిబంధనలు:
ఈ పథకం కింద ఉచిత కనెక్షన్ పొందిన లబ్ధిదారులకు ఉచిత తొలి సిలిండర్ తర్వాత, రీఫిల్లింగ్‌పై ప్రతి సిలిండర్‌కు రూ.300 చొప్పున సబ్సిడీ నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. అయితే అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితులు, అక్రమ రవాణాను నిరోధించే క్రమంలో కేంద్రం రీఫిల్ సబ్సిడీపై కీలక మార్పు చేసింది. గతంలో ఏడాదికి 6 సిలిండర్లకు సబ్సిడీ అందించగా, ప్రస్తుతం దానిని ఏడాదికి 4 సిలిండర్లకు కుదించింది. దీనివల్ల ప్రతి లబ్ధిదారు కుటుంబం ఏడాదికి గరిష్టంగా రూ.1,200 వరకు సబ్సిడీ ప్రయోజనం పొందగలరు.
సులభంగా ఆన్‌లైన్ దరఖాస్తు.. ఉజ్వల పోర్టల్‌లో ప్రక్రియ ప్రారంభం:
ఈ పథకానికి అర్హులైన మహిళలు అధికారిక వెబ్‌సైట్ (pmuy.gov.in) సందర్శించి ఇండియన్, భారత్ గ్యాస్ లేదా హెచ్‌పి గ్యాస్ సంస్థల్లో మీకు నచ్చిన కంపెనీని ఎంచుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసిన తర్వాత, సంబంధిత గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు దరఖాస్తును పరిశీలించి ఆమోదం తెలుపుతారు. ఎటువంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండానే డిస్ట్రిబ్యూటర్ వద్ద నుంచి గ్యాస్ కనెక్షన్, స్టవ్‌ను నేరుగా పొందవచ్చు. సరైన వంట గ్యాస్ సదుపాయం లేని గ్రామీణ ప్రాంత పేద మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
