పాకిస్థాన్‌లో అంతర్యుద్ధం.. హోం మంత్రి ఇంటికి నిప్పు.. జనంపై కాల్పులు.. రచ్చ రచ్చ
మోరో పట్టణంలో సింధ్ హోం మంత్రి జియావుల్ హసన్ లంజార్ ఇంటికి నిరసన కారులు నిప్పంటించారు
- Harishth Thanniru
- Published On : May 21, 2025 / 12:38 PM IST
Moro Town
Pakistan: ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ లో అంతర్యుద్ధం మొదలైంది. బలూచిస్థాన్ ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. మరోవైపు సింధ్ ప్రాంత ప్రజలు నీళ్ల కోసం అవస్థలు పడుతున్నారు. రోడ్డెక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. తాజాగా నౌషెహ్రో ఫిరోజ్ జిల్లాలోని మోరో పట్టణంలో సింధ్ హోంమంత్రి జియావుల్ హసన్ లంజార్ ఇంటికి నిరసన కారులు నిప్పుపెట్టారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు, నిరసనకారులకు మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఒక వ్యక్తి మరణించగా.. ముగ్గురు పోలీసులు సహా 11 మంది గాయపడ్డారు.
పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) నేతృత్వంలోని సింధ్ ప్రభుత్వానికి, కేంద్రంలోని ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మధ్య చోలిస్తాన్ కాలువల అంశం కీలకమైన వివాదానికి దారితీసింది. చోలిస్తాన్ ప్రాంతానికి సాగునీరు అందించడానికి సింధు నదిపై ఆరు కాలువలను నిర్మించాలని సమాఖ్య ప్రభుత్వం ప్రణాళిక వేసింది. ఈ ప్రాజెక్టును దాని ప్రధాన మిత్రపక్షమైన పీపీపీ, ఇతర సింధ్ జాతీయవాద పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. సింధ్ అంతటా ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి.
సింధు కాలువలు, కార్పొరేట్ వ్యవసాయం, ఇతర సమస్యలకు వ్యతిరేకంగా మోరో పట్టణంలోని ఒక జాతీయవాద సంస్థ నిరసనలకు పిలుపునిచ్చింది. నిరసనకారులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని బలవంతంగా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, నిరసన కారులకు మధ్య ఉధ్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
నిరసనకారులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. పోలీసులు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఆగ్రహంతో నిరసన కారులు మోరో పట్టణంలోని సింధ్ హోం మంత్రి జియావుల్ హసన్ లంజార్ ఇంటిపై దాడి చేశారు.ఇంటిలోకి వెళ్లి గదులు, ఫర్నీచర్‌కు నిప్పంటించి తగలబెట్టారు. పైకప్పు నుంచి స్ల్పిట్ ఎయిర్ కండిషనర్ల బయటి భాగాలను కూడా నేలపైకి విసిరారు. దీంతో హోమంత్రి ఇంటి పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగకమ్ముకుంది. మరోవైపు.. మోరో పట్టణంలో జరిగిన హింసపై సింధ్ హోంమంత్రి దర్యాప్తునకు ఆదేశించారు. నవాబ్షా, దాదు, హైదరాబాద్ జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో పోలీసు బృందాలు పట్టణానికి చేరుకుని స్థానిక పోలీసులతో కలిసి శాంతిభద్రతలను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు.
