Pune Porsche Case Bail : ఇద్దరి ప్రాణాలు తీసిన వాడికి బెయిల్.. డ్యాన్సులు, నోట్ల దండలతో వెల్కమ్.. ఛీ ఏం మనుషుల్రా..!

Pune Porsche Case Bail : రెండు సంవత్సరాల క్రితం మైనర్ బాలుడు పుల్లుగా తాగి అతి వేగంతో పోర్షే కారు నడిపి.. యాక్సిడెంట్ చేసి ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను బలి తీసుకున్న సంగతి గుర్తుందా.. అతడికి బెయిల్ వచ్చింది.

Pune Porsche Case Accused Gets Bail His Celebration Video went viral

  • పుణె పోర్షే కేసులో కీలక పరిణామం
  • నిందితుడికి బెయిల్ మంజూరు
  • డ్యాన్సులు, డబ్బుల దండతో ఘన స్వాగతం

Pune Porsche Case Bail : పుణె పోర్షే కార్ యాక్సిడెంట్ కేసు గుర్తుందా.. మైనర్ బాలుడు ఫుల్లుగా తాగి.. అత్యంత లగ్జరీ పోర్షే కారులో పరిమితి మించిన వేగంతో దూసుకుపోతూ.. రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు. చనిపోయిన వారు ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. చక్కగా చదువుకుని.. మంచి ఉద్యోగం తెచ్చుకుని.. కుటుంబానికి ఆసరాగా నిలిచిన వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ధనవంతుడైన ఓ తండ్రి అతి గారాబానికి రెండు జీవితాలు మాత్రమే కాదు రెండు కుటుంబాలు చెదిరిపోయాయి. వారు కోలుకోవడానికి ఓ జీవిత కాలం కూడా సరిపోదు. రెండు సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని పుణె, కల్యాణి నగర్ లో ఈ దారుణ ప్రమాదం చోటు చేసుకుంది. బిడ్డలను కోల్పోయిన ఆ తల్లిదండ్రులు నేటికి కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరి వారిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఆ నిందితుడి కుటుంబం ఏం చేస్తుంది..

తప్పతాగి.. అతి వేగంతో కారు నడిపి రెండు నిండు జీవితాలను బలి తీసుకున్న మైనర్ బాలుడికి తాజాగా సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇక బెయిల్ మీద బయటకు వచ్చిన కొడుక్కి అతడి తండ్రి ఘనంగా స్వాగతం పలికాడు. ఏదో శత్రు देश సైనికులను చీల్చి చెండాడి వచ్చిన వాళ్లను ఆహ్వానించినట్లు బిల్డప్ ఇచ్చాడు. డబ్బుల దండతో.. డ్యాన్సులు, పాటలతో కొడుక్కి స్వాగతం పలికాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో వీరిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

అసలేం జరిగింది…

ప్రముఖ బిల్డర్ విశాల్ అగర్వాల్ కుమారుడైన మైనర్ బాలుడు 2024 మే 19న పుణెలోని కల్యాణి నగర్ ప్రాంతంలో తప్పతాగి అతి వేగంతో పోర్షే కారు నడుపుతూ యాక్సిడెంట్ చేశాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు అనీష్ అవధియా, అశ్విని కోస్టాలను ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే చనిపోయారు. ఈ కేసులో అరెస్ట్ అయిన సదరు మైనర్ నిందితుడికి తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుమారు 22 నెలల పాటు జైలు శిక్ష (బాలల పరిశీలన గృహంలో) అనుభవించిన తర్వాత ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు.

బాలీవుడ్ సాంగ్, డబ్బుల దండ..

ఇదిలా ఉంటే జైలు నుంచి వస్తున్న కొడుకు ఏదో గొప్ప పని చేసినట్లు భావిస్తోన్న ఆ మైనర్ బాలుడి తండ్రి ఒక లోకల్ రెస్టారెంట్ లో తన కుమారుడికి ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశాడు. ప్రసిద్ధ బాలీవుడ్ సాంగ్ “బొంబాయి సే ఆయా మేరా దోస్త్, దోస్త్ కో సలాం కరో” అనే పాట ప్లే అవుతుంటే.. జైలు నుండి వచ్చిన కొడుకుతో కలిసి తల్లిదండ్రులు ఇద్దరూ ఏమాత్రం సిగ్గు లేకుండా డ్యాన్స్ చేస్తూ కనపించారు. అంతటితో ఆగక.. ఆ మైనర్ బాలుడి మెడలో పూల దండతో పాటు, కరెన్సీ నోట్లతో చేసిన భారీ దండలు కూడా వేశారు. వీరి చేష్టలను చూసి పక్కనే ఉన్న కస్టమర్లు, బంధువులు చప్పట్లు కొడుతుంటే కొడుకు తన తండ్రిని గాల్లోకి ఎత్తడం, మరోవైపు భార్య కూడా మెడలో కరెన్సీ నోట్ల దండ వేసుకుని చిందులు వేయడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది.

ఈ వీడియో చూసిన జనాలు.. రెండు నిండు ప్రాణాలు బలి తీసుకుని.. ఆ కుటుంబాలను రోడ్డు పాలు చేశామన్న పశ్చాతాపం మీలో మచ్చుకైనా లేదు.. వాడేమైనా గొప్ప పనులు చేసి జైలు నుంచి వచ్చాడా.. ఓ హంతకుడికి ఇలాంటి ఘన స్వాగతమా.. ఇది డబ్బున్న అహంకారమే.. ఈ సమాజం, న్యాయ వ్యవస్థ తమను ఏం చేయలేవని ఎగతాళి చేస్తున్నట్లు ఉంది.. ఛీ ఏం మనుషుల్రా మీరు అంటూ నెటిజనులు ఓ రేంజ్ లో దుమ్మెత్తిపోస్తున్నారు.

ఇక ఆ మైనర్ బాలుడి తల్లిదండ్రులు యాక్సిడెంట్ కేసులో అతడిని కాపాడుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నించారు. బ్లడ్ శాంపిల్స్ మార్చడం, కొడుకు తాగి లేడని చెప్పడానికి వైద్యులను మేనేజ్ చేయడం.. చివరకు కారు డ్రైవర్ ని నేరం ఒప్పుకోమంటూ బెదిరించారు. ఇన్ని దారుణాలు చేసిన వీరు.. ఇద్దరిని చంపిన కొడుక్కి ఇలా స్వాగతం పలకడంలో ఆశ్చర్యం లేదంటున్నారు.