Rahul Gandhi : పోలీసుల లాఠీలకు భయపడొద్దు.. ఛలో ఢిల్లీకి పోటెత్తండి… రాహుల్‌ గాంధీ పిలుపు

Rahul Gandhi : ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఓట్ బచావో.. దేశ్ బచావో భారీ ర్యాలీకి ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.

Rahul Gandhi

Rahul Gandhi : ఢిల్లీలో జరగనున్న రామ్‌లీలా మైదాన్ మార్చ్‌ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, ఓట్ల చోరీని అడ్డుకునేందుకు, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు చేపడుతున్న మార్చ్‌ అని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఓట్ బచావో.. దేశ్ బచావో పేరుతో భారీ ర్యాలీ చేపట్టనుంది.. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ప్రజలకు, యువతకు ఛలో ఢిల్లీకి పెద్దసంఖ్యలో తరలిరావాలంటూ పిలుపునిచ్చారు.

Also Read : Uma Kashvi : ఎవ‌రీ ఉమా కాష్వి? డ‌బ్ల్యూపీఎల్ వేలంలో చ‌రిత్ర‌.. లేడీ వైభ‌వ్ సూర్య‌వంశీ!

ఢిల్లీలోని రాంలీలా మైదానంలో చేపట్టిన మార్చ్ ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు.. ఇది భారతదేశ ఆత్మను కాపాడేందుకు చేపడుతున్న మార్చ్‌. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్‌ షా, కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌ కుమార్‌లతో విసిగిపోయిన వారందరూ ఈ మార్చ్ లో పాల్గొనాలని రాహుల్ గాంధీ కోరారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుకునే ప్రతిఒక్కరూ ఈ మార్చ్‌లో పాల్గొనాలి. ఇది ఒక్క నిరసన మాత్రమే.. ఇది దేశం మొత్తం చేస్తున్న నిరసన. పోలీసుల గురించి ఆందోళన చెందకండి. లాఠీచార్జీల గురించి భయపడకండి. ఇలాంటి చర్యలకు పాల్పడే ధైర్యం బీజేపీకి ఉండదు. మనమంతా కలిసి మార్చ్‌లో పాల్గొందాం. రాజ్యాంగాన్ని కాపాడేందుకు, భారతదేశాన్ని పరిరక్షించేందుకు కలిసికట్టుగా నడుద్దామని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు.

మీ రాజకీయ అనుబంధం ఏదైనా సరే.. విద్యార్థి సంఘాలన్నింటికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భారతదేశంపై దాడి జరుగుతోందని మీరు భావిస్తే, మీపై దాడి జరుగుతోందని, మీ భావప్రకటన స్వేచ్ఛ, మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు లక్ష్యంగా మారుతున్నాయని మీరు అనుకుంటే.. ఈ మార్చ్‌లో వచ్చి పాల్గొనండి. ఈ మార్చ్‌ అద్భుతంగా సాగుతుంది. ఇది ఈ దేశ ఆత్మను కాపాడేందుకు చేపడుతున్న మార్చ్‌. మీరందరినీ అక్కడ కలుసుకోవాలని ఎదురుచూస్తున్నాను. అంటూ రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

మరోవైపు, నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న ఇండియా కూటమి ర్యాలీని భారీ స్థాయిలో నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి ఎంపీలతో సమావేశమవుతున్నారు. శుక్రవారం నిర్వహించనున్న మాక్ పార్లమెంట్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌ను ప్రతీకాత్మకంగా అభిశంసించే కార్యక్రమాన్ని చేపట్టాలని వారు భావిస్తున్నారు. ఈ కార్యక్రమం అనంతరం నవంబర్ 1న రాంలీలా మైదానంలో ర్యాలీ నిర్వహించనున్నారు.