Railways Satey Rules : ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రాత్రి 11 నుంచి ఫోన్ ఛార్జింగ్ బంద్.. రైల్వే బోర్డు కీలక ఆదేశాలు!
Railways Satey Rules : రైళ్లలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు ఆఫ్ చేయాలని రైల్వే బోర్డు ఆదేశించింది. పవర్ బ్యాంక్ పేలుడు ఘటన నేపథ్యంలో భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నారు..
- Sreehari A
- Published on- October 28, 2026 / 03:12 PM IST
Railways Satey Rules
- రైళ్లలో రాత్రిపూట ఫోన్ ఛార్జింగ్‌కు బ్రేక్..
- పవర్ బ్యాంక్ పేలుడు ఎఫెక్ట్..
- రైల్వే శాఖ మరోసారి హెచ్చరిక
- ఫోన్ ఛార్జింగ్ విషయంలో ఈ తప్పు చేయొద్దు
Railways Satey Rules : రాత్రిపూట రైలులో ప్రయాణం చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. మీ ఫోన్ ఛార్జింగ్ విషయంలో ముందుగానే జాగ్రత్త పడాలి. రైళ్లలో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు పనిచేయవు.
ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని రైల్వే బోర్డు మరోసారి అన్ని జోన్ల అధికారులను ఆదేశించింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది..
పవర్ బ్యాంక్ పేలుడు.. మళ్లీ తెరపైకి సేఫ్టీ రూల్స్ :
రైల్వే బోర్డు తాజా ఆదేశాలకు ఓ ఘటన మెయిన్ రీజన్.. సౌత్ ఈస్టర్న్ రైల్వే పరిధిలోని ముంబై లోకల్ రైలులో ఛార్జింగ్‌కు పెట్టిన పవర్ బ్యాంక్ పేలిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో రైలు కోచ్‌లో దట్టమైన పొగ వ్యాపించినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ ఘటనతో రైళ్లలో ఎలక్ట్రానిక్ డివైజ్‌ల ఛార్జింగ్ విషయంలో భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.
ఈ నేపథ్యంలో అక్టోబర్ 26న రైల్వే బోర్డు లేఖ జారీ చేసింది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు అన్ని కోచ్‌లలో ఛార్జింగ్ పాయింట్లను తప్పనిసరిగా ఆఫ్ చేయాలని ఆదేశించింది. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని స్పష్టం చేసింది. నిర్ణీత సమయాల్లో ఛార్జింగ్ పాయింట్లను ఆఫ్ చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహించినట్లు కూడా లేఖలో పేర్కొంది.
ఆకస్మిక తనిఖీలు.. సిబ్బందికి కీలక ఆదేశాలు :
నిబంధనలు కాగితాలకే పరిమితం చేయకుండా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులకు బోర్డు సూచించింది. రైళ్లలో పనిచేసే సిబ్బందికి ఈ నిబంధనపై అవగాహన కల్పించాలని తెలిపింది. అధికారులు, పర్యవేక్షకులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఛార్జింగ్ పాయింట్లు సమయానికి ఆఫ్ చేస్తున్నారా లేదా అనేది పరిశీలించాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించింది.
పదేళ్లకు పైగా అమల్లో రూల్ :
రైళ్లలో రాత్రిపూట ఛార్జింగ్ నిలిపివేసే నిబంధన కొత్తదేమీ కాదు.. 2014 జూన్ 19న ఈ నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరు నుంచి హజూర్ సాహిబ్ నాందేడ్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత రైల్వే సేఫ్టీ కమిషనర్ సిఫారసుతో ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. 2021లోనూ రైల్వే శాఖ దీన్ని కచ్చితంగా అమలు చేయాలని సూచించింది.
ప్రయాణికులు ఏం చేయాలి? :
రాత్రిపూట రైలు ప్రయాణం చేసేవారు బయలుదేరే ముందే తమ ఫోన్లు, అవసరమైన ఎలక్ట్రానిక్ డివైజ్‌లను పూర్తిగా ఛార్జింగ్ చేసుకోవడం బెటర్.. ముఖ్యంగా రాత్రి ప్రయాణాల్లో ఫోన్ బ్యాటరీ అయిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణికుల సేఫ్టీ కోసం తీసుకున్న ఈ నిర్ణయానికి అందరూ సహకరించాలని రైల్వే శాఖ సూచిస్తోంది.
