Surya Tilak : శ్రీరామ నవమి నాడు అయోధ్యలో అద్భుతం.. రామయ్య నుదుటిన మెరిసిన సూర్య తిలకం

Surya Tilak : శ్రీరామ నవమి పండుగ నాడు అయోధ్యలో అద్భుతం ఆవిష్కృతమైంది. సూర్య తిలకాన్ని దర్శించి భక్తులు పరవశించారు.

Ram Navami 2026 witnesses grand Surya Tilak at Ayodhya Ram Temple

Surya Tilak : దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో సంబరంగా శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటున్నారు. అయోధ్యలో అంగరంగ వైభవంగా నవమి వేడుకలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే శ్రీరామనవమి వేళ అయోధ్యలో అద్భుత దృశ్యం సాక్షాత్కరించింది. బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం దర్శనమిచ్చింది. దీన్ని చూసిన భక్తులు పరవశించిపోయారు. అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత వచ్చిన మూడో శ్రీరామనవమి ఇది. ఇక్కడ వేడుకలు అంబరాన్నంటాయి. రాములోరి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తారు.

శ్రీరామనవమి నాడు మధ్యాహ్న సమయంలో సూర్య కిరణం నేరుగా రామ్ లల్లా విగ్రహం నుదుటిపై పడటంతో.. అద్భుతమైన సూర్య తిలక దర్శన భాగ్యం కలిగింది. ఈ అద్భుతం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగేది కాదు. సరిగ్గా ప్రణాళికతో, ఖచ్చితమైన సమయంతో, ప్రత్యేక ఏర్పాట్ల వల్ల సంవత్సరానికి ఒకసారి ఈ సూర్య తిలక దర్శనం సాధ్యమవుతుంది. ఈ ఆధ్యాత్మిక క్షణం వెనుక ఉన్న సాంకేతిక విధానం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

సూర్య తిలకం సాక్షాత్కరించడం వెనక ప్రధాన కారణం.. సూర్యకాంతిని నియంత్రిత పద్ధతిలో ఒక నిర్దిష్ట స్థలానికి తీసుకురావడం. సుమారు 5.8 సెంటీమీటర్ల వెడల్పు గల సన్నని కాంతి కిరణం రామ్ లల్లా నుదుటిపై సరిగ్గా పడేలా ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన అద్దాలు, లెన్సులు (lenses) ఉపయోగిస్తారు. మొత్తం నాలుగు అద్దాలు, నాలుగు లెన్సులు ఉంటాయి. ఇవి ఆలయం పైభాగం నుంచి గర్భగుడి వరకు సూర్యకాంతిని దశలవారీగా దారి మళ్లిస్తాయి. మధ్యాహ్న సమయంలో సూర్యకిరణాలు సరైన కోణంలో ఉండగా, అవి సుమారు 3 నుంచి 3.5 నిమిషాలపాటు విగ్రహం నుదుటిపై కేంద్రీకృతమవుతాయి.

ఈ అద్భుతం వెనక ఖచ్చితమైన ఆప్టో-మెకానికల్ సిస్టమ్ ఉంది. అలానే ఇది సౌర ట్రాకింగ్ సూత్రాల ఆధారంగా పనిచేస్తుంది. అందుకే ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున ఈ అద్భుత ఘట్టం సాధ్యమవుతుంది.