Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. గ్రామస్థులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ముగ్గురు చిన్నారులుసహా ఏడుగురు మృతి..
Road Accident : ఝార్ఖండ్‌లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన భారీ ట్రక్కు రోడ్డుపక్కన గుమిగూడిన గ్రామస్థులపైకి దూసుకెళ్లింది.
- Harish Thanniru
- Published on- November 6, 2026 / 07:43 AM IST
Road Accident
Road Accident : ఝార్ఖండ్‌లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన భారీ ట్రక్కు రోడ్డుపక్కన గుమిగూడిన గ్రామస్థులపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులుసహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో చిన్నారి తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఝార్ఖండ్‌లోని ఖుంటి జిల్లాలో గురువారం రాత్రి ఈ విషాద ఘటన జరిగింది. కర్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రా-తోర్పా ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ట్రక్కు రోడ్డుపక్కన ఉన్న జనంపైకి దూసుకెళ్లడంతో ఏడుగురు మృత్యువాత పడ్డారు.
గురువారం రాత్రి సుమారు 9.45 గంటల సమయంలో ఓ స్కూటీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టు సమీపంలోని పొదల్లో పడిపోయింది. ఈ ఘటన శబ్దం విన్న స్థానికులు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులు అక్కడికి చేరుకున్నారు. స్కూటీపై ఉన్న వ్యక్తికి సహాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో తోర్పా వైపు నుంచి కర్రా దిశగా అతివేగంగా వచ్చిన ట్రక్కు అక్కడ గుమిగూడిన వారిపైకి దూసుకెళ్లింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు కలిసి ఖుంటి సదర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 12 ఏళ్ల సౌరభ్ నాయక్ కన్నుమూశాడు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది.
ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు మరణించారు. మృతుల్లో ఒక 11 నెలల పసికందు కూడా ఉన్నట్లు తెలుస్తుండగా.. ఖుష్బూ కుమారి అనే ఐదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
