Rs 2000 for Women: ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, మహిళలకు నెలకు 2వేలు, ఇంకా.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మ్యానిఫెస్టో ఇదే
BJP Manifesto Rs 2000 for women: తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే మహిళలకు 3% స్టాంప్ డ్యూటీ రాయితీ, రూ. 10వేలు ఒకేసారి ఇచ్చే గృహ సహాయ పథకం, గృహోపకరణాల కోసం రూ. 8వేల కూపన్లతో సహా సహాయక చర్యలను కొనసాగిస్తామని కూడా ఆ పార్టీ ప్రకటించింది.
- Naveen
- Updated on- April 15, 2026 / 03:09 PM IST
BJP Tamil Nadu Manifesto 2026
- తమిళనాడు ఓటర్లపై బీజేపీ వరాల జల్లు
- ఓటర్లను ఆకట్టుకునేలా బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టో
- మహిళలకు నెలకు 2వేలు
- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం
BJP Manifesto: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమిళనాడు కచ్చితంగా గెలవాలని పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో ఓటర్లను అట్రాక్ట్ చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించింది. బీజేపీ మంగళవారం తన తమిళనాడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో కేంద్ర మంత్రి జేపీ నడ్డా పలు సంక్షేమ, పాలన హామీలను వెల్లడించారు. అలాగే అధికార డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశారు.
తమిళ నూతన సంవత్సరం రోజున మేనిఫెస్టోను ఆవిష్కరించడం “శుభప్రదం” అని జేపీ నడ్డా అన్నారు. ఈరోజు బీఆర్ అంబేద్కర్ 150వ జయంతి కూడా అని ఆయన తెలిపారు. తమిళనాడు “ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతకు పుట్టినిల్లు” అని అన్నారు. తిరువళ్లువర్, సుబ్రహ్మణ్య భారతి వంటి మహనీయులను స్మరించుకున్నారు. సాంస్కృతిక వారసత్వం పట్ల గర్వంగా ఉందన్నారు.
తన ఎన్నికల మేనిఫెస్టోలో సంక్షేమానికి పెద్ద పీట వేసింది బీజేపీ. మహిళలకు నెలకు రూ.2వేలు, సంవత్సరానికి మూడు ఉచిత ఎల్‌పిజి సిలిండర్లు, పన్నుల పెంపు, పెరుగుతున్న జీవన వ్యయాల భారాన్ని తగ్గించడానికి ప్రతి కుటుంబానికి ఒకేసారి రూ. 10వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అర్హులైన మహిళలకు ఇ-స్కూటర్ల కొనుగోలుపై రూ. 25వేలు సబ్సిడీ, జల్లికట్టు ఎద్దులను పెంచే వారికి నెలకు రూ. 2వేలు సాయం, అందులో పాల్గొనే వారు మరణిస్తే రూ. 10 లక్షల ఎక్స్-గ్రేషియాను కూడా మేనిఫెస్టోలో ప్రతిపాదించింది బీజేపీ.
తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే మహిళలకు 3% స్టాంప్ డ్యూటీ రాయితీ, రూ. 10వేలు ఒకేసారి ఇచ్చే గృహ సహాయ పథకం, గృహోపకరణాల కోసం రూ. 8వేల కూపన్లతో సహా సహాయక చర్యలను కొనసాగిస్తామని కూడా ఆ పార్టీ ప్రకటించింది. ప్రధాన దేవాలయాలలో స్థానిక నివాసితుల కోసం ప్రతిరోజూ రెండు గంటల దర్శన సమయాలను కేటాయించాలని, తిరుపరంకుండ్రం కొండపై దీపాలు వెలిగించడంతో సహా కార్తీక దీపం ఉత్సవాలను కొనసాగించాలని కూడా ప్రతిపాదించింది.
పరిపాలన, శాంతిభద్రతల విషయానికి వస్తే, తమిళనాడులో మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలు 51% పెరిగాయని నడ్డా ఆరోపించారు. డీఎంకేపై అవినీతి, కుటుంబ పాలన ఆరోపణలు చేశారు. ఉద్యోగాల కోసం డబ్బు ఇవ్వడం, టెండర్లకు సంబంధించిన అవకతవకలతో సహా పలు కుంభకోణాల్లో పలువురు డీఎంకే నాయకుల పేర్లను ప్రస్తావించారు. అధికార పార్టీని “అవినీతి సంరక్షకులు” అని అభివర్ణించారు.
పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు జీరో ఎఫ్‌ఐఆర్ అమలు, ఘోరమైన నేరాల కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులు, భద్రత నిఘాను మెరుగుపరచడానికి బస్సులు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో 100 సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వంటి చర్యలను కూడా బీజేపీ ప్రకటించింది.
Also Read: లోక్‌సభ స్థానాలు 850కి పెంపు..! నియోజకవర్గాల పునర్ విభజనపై కేంద్రం ప్రతిపాదనలు
