Sabarimala Aravana Payasam: శబరిమలో ప్రసాదం కొరత.. దేవస్వం బోర్డుపై కేరళ మంత్రి ఆగ్రహం.. హైకోర్టుకు వెళ్లేందుకు సన్నాహాలు!
శబరిమల శ్రీధర్మశాస్తా ఆలయంలో భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన 'ఆరవణ పాయసం(Sabarimala Aravana Payasam)' ప్రసాదానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Sabarimala aravana payasam shortage kerala minister fire on devaswom board
Sabarimala Aravana Payasam: శబరిమల శ్రీధర్మశాస్తా ఆలయంలో భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన ‘ఆరవణ పాయసం’ ప్రసాదానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే ప్రతీ భక్తుడు ఈ ప్రసాదాన్ని తప్పక కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇటీవల ఆలయంలో ఏర్పడిన ఆరవణ పాయసం కొరత కేరళ ప్రభుత్వం మరియు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది. పాయసం కొరత కారణంగా ఒక్కో భక్తునికి ఒక టిన్ మాత్రమే విక్రయించాలంటూ బోర్డు పరిమితి విధించడంపై కేరళ దేవస్వం శాఖ మంత్రి మురళీధరన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
యంత్రాల నవీకరణ వల్లే ప్రసాదం కొరత.. దేవస్వం బోర్డు:
మండల-మకరవిళక్కు యాత్రా సమయానికి ముందే ఆరవణ పాయసం(Sabarimala Aravana Payasam) రోజువారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని 2.5 లక్షల టిన్ల నుండి 3.5 లక్షల టిన్లకు పెంచేందుకు 45 రోజుల ప్రాజెక్టును ప్రారంభించామని దేవస్వం బోర్డు తెలిపింది. ప్లాంట్ విస్తరణ పనుల వల్లే ప్రస్తుతం సరఫరాలో తాత్కాలిక కొరత ఏర్పడిందని, యాత్రా కాలంలో రోజువారీ డిమాండ్ 4.5 లక్షల టిన్లకు చేరే అవకాశం ఉందని వివరించింది. ఈ విషయమై ఇప్పటికే కేరళ హైకోర్టుకు నివేదిక సమర్పించినట్లు పేర్కొంది.
ప్రయోగాల పేరుతో భక్తులను ఇబ్బంది పెట్టొద్దు.. మంత్రి మురళీధరన్:
మండలం సీజన్‌కు ముందు కాకుండా, ఆలయం మూసివేసిన సమయంలో లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే ఈ నవీకరణ పనులు చేపట్టి ఉండాల్సిందని మంత్రి అభిప్రాయపడ్డారు. భక్తులకు అసౌకర్యం కలిగిస్తే ప్రభుత్వం సహించేది లేదని హెచ్చరించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌తో చర్చించి హైకోర్టును ఆశ్రయించాలా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రాబోయే యాత్రా కాలాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించే అంశంపైనా చర్చించనున్నట్లు మంత్రి తెలిపారు.
