Six burned alive : భార్యపై కోపంతో బావమరిది ఇంటిని తగలబెట్టాడు…ఆరుగురు సజీవ దహనం
కర్నాటకలో ఓ తాగుబోతు దారుణానికి ఒడిగట్టాడు. ఇంటికి రానన్న భార్యపై కోపంతో బావమరిది ఇంటిని తగలబెట్టాడు. ఆరుగురు సజీవ దహనం అయ్యారు.
- bheemraj
- Published On : April 4, 2021 / 01:41 PM IST
Six Burned Alive
Six burned alive in Karnataka : కర్నాటకలో ఓ తాగుబోతు దారుణానికి ఒడిగట్టాడు. ఇంటికి రానన్న భార్యపై కోపంతో బావమరిది ఇంటిని తగలబెట్టాడు. ఆరుగురు సజీవ దహనం అయ్యారు. ముగ్గురు మంటల్లో సజీవ దహనమవ్వగా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో నలుగురు చిన్నారులే. ఈ ఘటన కొడగు జిల్లా కనూరులో చోటు చేసుకుంది.
కనూరుకు చెందిన బోజ అనే వ్యక్తి మద్యానికి బానిసై భార్య బేబీతో తరచూ గొడవపడేవాడు. ఈనేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కూడా బోజ భార్యతో గొడవపడ్డాడు. భర్త ఆగడాలను భరించలేకపోయిన బేబీ.. కనూరులోనే ఉంటున్న తన సోదరుడు మంజు ఇంటికి పిల్లలతో సహా వెళ్లింది. మద్యం మత్తులో ఉన్న బోజ.. మంజు ఇంటికి వెళ్లి బేబీని రావాలని కోరగా ఆమె రావడానికి నిరాకరించింది.
అప్పటికి వెళ్లిపోయిన బోజ.. మళ్లీ అర్ధరాత్రి దాటిన తర్వాత మంజు ఇంటికి వచ్చాడు. బయట తాళాలు వేసి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పారిపోయాడు. ఇంట్లో బోజ కుటుంబ సభ్యులు నలుగురు, మంజు కుటుంబానికి చెందిన మరో నలుగురున్నారు. అర్ధరాత్రి కావడంతో అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఇల్లు అంతటా మంటలు వ్యాపించాయి. బయటికి వెళ్లలేక బేబీ (40), సీత (45), ప్రార్థన (6) మంటల్లోనే కాలిపోయి చనిపోయారు.
స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని మైసూరులోని కేఆర్ ఆస్పత్రికి తరలించగా.. విశ్వాస్ (3), ప్రకాశ్ (6), విశ్వాస్ (7) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. భాగ్య (40), పాచె (60) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
