Lizard Found in Food : స్కూల్‌లో షాకింగ్ ఘటన.. పిల్లలకు పెట్టిన టిఫిన్‌లో బల్లి.. ఆస్పత్రిలో విద్యార్థులు.. ఆందోళనలో తల్లిదండ్రులు..
Lizard Found in Food : ప్రభుత్వ పాఠశాలలో బల్లి పడిన ఆహారం తినడంతో విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
- Harish Thanniru
- Published on- September 24, 2026 / 04:51 PM IST
Lizard Found in Food
Lizard Found in Food : తమిళనాడు రాష్ట్రంలో ఆందోళనకరమైన ఘటన చోటు చేసుకుంది. తిరువళ్లూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించిన అల్పాహారంలో బల్లి కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. ఆహారం తీసుకున్న తర్వాత వాంతులు, మైకం వంటి లక్షణాలతో 36 మంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై జిల్లా అధికారులు స్పందించి పాఠశాలను పరిశీలించడంతో పాటు ఆహార నాణ్యత, పరిశుభ్రతపై విచారణ చేపట్టారు.
తిరువళ్లూరు సమీపంలోని కొట్టయ్యూర్ పంచాయతీ యూనియన్ మిడిల్ స్కూల్లో గురువారం ఉదయం విద్యార్థులకు అల్పాహారం అందించారు. ఈ సందర్భంగా ఆహారంలో బల్లి ఉన్నట్లు గుర్తించారు. దీంతో విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆహారం తీసుకున్న కొంతమంది విద్యార్థులకు కొద్దిసేపటికే వాంతులు, మైకం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో పాఠశాల సిబ్బంది అప్రమత్తమై విద్యార్థులను తిరువళ్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కవిత ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలను కూడా సందర్శించి ఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని కలెక్టర్ తెలిపారు. ఘటనకు సంబంధించి ఆహారం తయారీ, నిల్వ, పంపిణీ ప్రక్రియలను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఘటనపై ఆహార భద్రతా శాఖ అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆహారంలో బల్లి ఎలా పడింది, వంట సమయంలో నాణ్యత, పరిశుభ్రతా ప్రమాణాలు పాటించారా అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
