Harish Rana Passive Euthanasia : సుప్రీంకోర్టు సంచలనం.. దేశంలోనే తొలి కారుణ్య మరణానికి అనుమతి.. తీర్పు చదువుతూ ఏడ్చేసిన జడ్జి

Harish Rana Passive Euthanasia : పదమూడేళ్లుగా జీవచ్ఛంలా పడి ఉన్న ఆ వ్యక్తి బాధ చూడలేక సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

Supreme Court Judgment in harish rana euthanasia allows passive euthanasia first in india

Harish Rana Passive Euthanasia : కారుణ్య మరణం.. దీని గురించి మనం తరచుగా వింటూ ఉంటాం. జీవచ్ఛవంలా మారి, బతుకు భారమై ఇతరుల మీద ఆధారపడిన వారు.. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ అనేక సందర్భాల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును అభ్యర్థించారు. కానీ మన న్యాయవ్యవస్థ ఇలాంటి వాటిని ప్రోత్సహించదు. పుట్టిన ప్రతి ఒక్కరూ ఆయుష్షు తీరే వరకు బతకాలనే కోరుకుంటుంది. అలాంటి సుప్రీంకోర్టు తాజాగా సంచలన తీర్పు వెల్లడించింది. దేశంలోనే తొలిసారి కారుణ్య మరణానికి ఆమోదం తెలుపుతూ తీర్పు వెల్లడించింది. ఈ తీర్పు చదివే సమయంలో సుప్రీంకోర్టు జస్టిస్ భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. అసలింతకీ కారుణ్య మరణానికి అనుమతి పొందిన వారు ఎవరు.. వారి పరిస్థితి ఎలా ఉంది అంటే..

హరీష్ రాణా అనే 31 ఏళ్ల యువకుడి విషయంలో సుప్రీంకోర్టు ఈ తీర్పు వెల్లడించింది. గత 13 సంవత్సరాలుగా ‘పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్’ (PVS)లో ఉన్న హరీష్ రాణా విషయంలో.. కారుణ్య మరణం (మెర్సీ కిల్లింగ్)కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. పాసివ్ యుథనేసియా.. అంటే నిష్క్రియాత్మక దయా మరణం/కారుణ్య మరణానికి అంగీకరించింది. హరీష్ రాణా తల్లిదండ్రుల అభ్యర్థనలతో.. గత కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న విచారణను పరిశీలించిన సుప్రీంకోర్టు బుధవారం మార్చి 11, 2026న తుది తీర్పు వెల్లడించింది. జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ కె.వి. విశ్వనాథన్‌లతో కూడిన బెంచ్ ఈ తీర్పు వెల్లడించింది. ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న హరీష్ రాణా విషయంలో.. పాసివ్ యుథనేసియా ప్రక్రియ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసులో తుది తీర్పు వెల్లడించడానికి ముందు.. హరీష్ రాణా ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం కోసం సుప్రీంకోర్టు.. రెండు వైద్య బోర్డుల అభిప్రాయాలను అధ్యయనం చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ సంచలన తీర్పు వెల్లడించింది.

అసలేం జరిగిందంటే..
సుమారు 13 సంవత్సరాల క్రితం అనగా.. 2013, ఆగస్టు 20న రాఖీ పండుగ నాడు హరీష్ రాణా జీవితంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నాడు చండీగఢ్ యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న హరీష్.. ఆ రోజున ప్రమాదవశాత్తు.. తాను ఉంటున్న హాస్టల్ 4వ అంతస్తు భవనం నుంచి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. వైకల్యం బారిన పడ్డాడు. హరీష్‌కు మంచి చికిత్స అందించినా.. అతడు కళ్లు తెరవలేకపోయాడని, శరీరంలోని అవయవాలను కదల్చలేకపోయాడని.. ఇక హరీష్ రాణా శాశ్వతంగా మంచానికే పరిమితమని వైద్యులు ప్రకటించారు.

హరీష్ రాణాకు చికిత్స చేయించడం కోసం భారీగా ఖర్చు కావడంతో అతడి కుటుంబ పరిస్థితులు దిగజారాయి. ఇదిలా ఉంటే.. హరీష్ రాణాకు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. వారి సంరక్షణ కోసం ఢిల్లీలోని మహావీర్ ఎన్‌క్లేవ్‌లోని తమ ఇంటిని అమ్మేసి ఘజియాబాద్‌కు మకాం మార్చారు.

సంవత్సరాలు గడుస్తున్నా హరీష్ ఆరోగ్యంలో మార్పు రాలేదు. చికిత్సకు చేతిలో డబ్బులు కూడా లేకపోవడంతో.. హరీష్ రాణా తల్లిదండ్రులు.. జూలై 2024లో కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు తల్లిదండ్రుల అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ క్రమంలో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండు సంవత్సరాల క్రితం నవంబర్ 2024లో అప్పటి సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్, హరీష్ పూర్తిగా లైఫ్ సపోర్ట్‌పై ఆధారపడటం లేదని చెప్పుకొచ్చింది. కేంద్రమే హరీష్ చికిత్స, వసతి కోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

ఇక నాటి నుంచి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రమే హరీష్‌కు చికిత్స అందిస్తోంది. అయితే అతడి పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుండటమే కాక, కోలుకునే అవకాశం చాలా తక్కువని వైద్య నివేదికలు వెల్లడించాయి. తాజాగా ఈ మెడికల్ రిపోర్టులపై జస్టిస్ జేబీ పార్దివాలా ధర్మాసనం స్పందిస్తూ.. “ఈ నివేదిక చాలా బాధాకరమైంది. హరీష్‌ను ఇలాగే కొనసాగించలేము” అని పేర్కొంటూ హరీష్ రాణా కారుణ్య మరణానికి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు సంచలనంగా మారింది.