Supreme Court on Conversion : మత మార్పిడిలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ‘ఆ మతంలోకి మారితే SC హోదా రద్దు’
Supreme Court on Conversion : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మత మార్పిడిలపై సంచలన వ్యాఖ్యలు చేసింది
- Dharani Pilli
- Published On : March 24, 2026 / 12:40 PM IST
Supreme court verdict on religion conversion said those who converted to christianity cannot claim sc rights
Supreme Court on Conversion : మత మార్పిడిలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఎస్సీల మత మార్పిడి అనంతర హక్కులపై గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి, ఆ మతాన్ని స్వీకరించి ఆచరిస్తున్నట్లయితే, అతన్ని షెడ్యూల్డ్ కాస్ట్ (SC) సభ్యుడిగా పరిగణించలేమని హైకోర్టు చెప్పిన తీర్పును సుప్రీంకోర్టు సైతం సమర్థించింది.
హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతం కాకుండా ఇతర మతాన్ని అనుసరించే వ్యక్తిని షెడ్యూల్డ్ కాస్ట్ (ఎస్సీ) సభ్యుడిగా గుర్తించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఇతర మతంలోకి మారడం వల్ల షెడ్యూల్డ్ కాస్ట్ హోదా తక్షణమే పూర్తిగా కోల్పోతుందని కోర్టు పేర్కొంది.
భారత రాజ్యాంగంలోని క్లాజ్ 3 ప్రకారం షెడ్యూల్డ్ కాస్ట్‌గా పరిగణించబడని వ్యక్తి, రాజ్యాంగం లేదా పార్లమెంట్/రాష్ట్ర చట్టాల కింద లభించే ఎటువంటి ప్రయోజనం, రక్షణ, రిజర్వేషన్ లేదా హక్కును పొందలేడు. ఈ నిబంధనకు ఎటువంటి మినహాయింపు లేదు. ఒక వ్యక్తి ఒకేసారి ఇతర మతాన్ని ఆచరిస్తూ, అదే సమయంలో షెడ్యూల్డ్ కాస్ట్ సభ్యుడిగా తన హోదాను క్లెయిమ్ చేయలేడు,” అని కోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పు ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్‌గా పనిచేస్తున్న సందర్భంలో వెలువడింది. ఆ వ్యక్తి తనపై దాడి జరిగిందని ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు వేశారు. అయితే, అతను క్రైస్తవ మతాన్ని స్వీకరించి ఆ మతాన్ని అనుసరిస్తున్నందున, SC&ST చట్టం కింద రక్షణ పొందడం చట్టపరంగా సరైంది కాదని ప్రత్యర్థులు వాదించారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా దీన్నే సమర్థించింది.
