Tribunal Appointments: ట్రిబ్యూనల్ అపాయింట్‌మెంట్‌లలో కేంద్రం తీరుపై సుప్రీం అసంతృప్తి
ట్రిబ్యూనల్స్‌లో అపాయింట్మెంట్లపై ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సిఫార్సుల నుంచి కొంత మందిని మాత్రమే తీసుకోవడంపై...
- Subhan Ali Shaik
- Published On : September 15, 2021 / 06:38 PM IST
Supreme Court
Tribunal Appointments: ట్రిబ్యూనల్స్‌లో అపాయింట్మెంట్లపై ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సిఫార్సుల నుంచి కొంత మందిని మాత్రమే తీసుకోవడంపై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. 2 వారాల్లో ట్రిబ్యునల్ నియామకాలు పూర్తవ్వాలని, ఎవరినైనా నియమించకపోతే కారణం చెప్పాలని ఆదేశించింది. ప్రజాస్వామిక దేశంలో కచ్చితంగా చట్టాన్ని అనుసరించాల్సిందేనని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.
కొవిడ్ పరిస్థితుల్లోనూ ప్రభుత్వం అడిగిందని దేశమంతా తిరిగి 544 మందిని ఇంటర్వ్యూ చేశాం. అందులో 11 మంది జ్యూడీషియల్ సభ్యులు, 10 మంది టెక్నికల్ సభ్యుల పేర్లు ఇస్తే.. కొందరినే నియమించారు. మిగతా వాళ్ల పేర్లను వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచారని రమణ అన్నారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ నియామకాలని బట్టి ఎక్కువ సిఫార్సులు చేసినా కొందరినే నియమించినట్లు అర్థమవుతుంది.
ఇదేం ఎంపిక? ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లోనూ అలాగే చేసింది. ఈ నిర్ణయాలు చాలా అసంతృప్తి కలిగించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రమణ.
దీనిపై స్పందించిన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్.. కొన్ని సిఫార్సులను వదిలేసే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందనడంతో రమణ తీవ్రంగా స్పందించారు. చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై సీజేఐతోపాటు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎల్ నాగేశ్వర్ రావ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. ప్రభుత్వానిదే తుది నిర్ణయమైతే సెలక్షన్ కమిటీకి ఉన్న విలువేంటని జస్టిస్ నాగేశ్వర్ రావ్ ప్రశ్నించారు.
