Abhijeet Dipke : నన్ను ఉగ్రవాదిలా చూస్తున్నారు.. దీక్షలో కన్నీటి పర్యంతమైన అభిజీత్ దీప్కే
Abhijeet Dipke : జంతర్ మంతర్ వద్ద దీక్ష ప్రారంభించే సమయంలో భావోద్వేగానికి గురైన అభిజీత్ దీప్కే కన్నీళ్లు పెట్టుకున్నారు.
Abhijeet Dipke
Abhijeet Dipke : విద్యా వ్యవస్థలో పటిష్టమైన సంస్కరణలు తీసుకురావాలని, నీట్ పరీక్షలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 20 నుంచి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన కొనసాగిస్తోంది. ఈ పోరాటానికి మద్దతుగా సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ జంతర్ మంతర్ లో ఆమరణ నిరాహార దీక్షచేపట్టిన విషయం తెలిసిందే. శనివారంతో దీక్ష 21వ రోజుకు చేరింది. అయితే, ఇప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఢిల్లీ హైకోర్టు, వైద్యులు ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేయడంతో శనివారం ఉదయం ఢిల్లీ పోలీసులు సోనం వాంగ్ చుక్ దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
వాంగ్చుక్ శాంతియుతంగా నిరసన చేస్తున్న సమయంలో పోలీసులు బలవంతంగా తరలించారని సీజేపీ నేతలు ఆరోపించారు. వాంగ్చుక్ తరలింపును వ్యతిరేకిస్తూ సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే స్వయంగా నిరాహార దీక్ష ప్రారంభించాడు. మా ఉద్యమం ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. ఈ పోరాటం కొనసాగుతుంది. ఎల్లుండి పార్లమెంట్ వరకు మార్చ్ నిర్వహించి తీరుతామని అన్నారు. మా డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేదాకా ఇక్కడి నుంచి కదలం అని అభిజిత్ దీప్కే ప్రకటించాడు.
దీక్ష ప్రారంభించే సమయంలో భావోద్వేగానికి గురైన అభిజీత్ దీప్కే కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను దేశ భద్రతకు ముప్పు కాదు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. ప్రజాస్వామ్య పద్ధతిలో మా గొంతును వినిపిస్తున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై అనవసరంగా కఠినంగా వహరించారని ఆరోపించారు.
ఇక, జంతర్ మంతర్ వద్ద సోనం వాంగ్చుక్కు సంఘీభావంగా నిరాహార దీక్ష చేస్తున్న AISAకు చెందిన ముగ్గురు విద్యార్థి నేతలు కూడా తమ దీక్షను కొనసాగిస్తున్నారు. వాంగ్చుక్ ఆస్పత్రికి తరలించినప్పటికీ ఉద్యమం ఆగబోదని, తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగుతుందని ఆందోళనకారులు స్పష్టం చేశారు.
