Vikram-1 Rocket Launch : విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం.. భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభం.. అభినందించిన ప్రధాని మోదీ
Vikram-1 Rocket Launch : ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
Vikram-1 Rocket Launch
Vikram-1 Rocket Launch : భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ప్రాంరభమైంది. ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం మధ్యాహ్నం 12.05గంటలకు ఈ ప్రయోగం జరిగింది.
షెడ్యూల్ ప్రకారం.. శనివారం ఉదయం 11.30 గంటలకు విక్రయ్ -1 ప్రయోగం జరగాల్సి ఉంది. కానీ, సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు. అనంతరం 35 నిమిషాల తరువాత మధ్యాహ్నం 12.05 గంటలకు రాకెట్ ను ప్రయోగించారు. ఈ ప్రయోగాన్ని మంత్రి నారా లోకేశ్ తన కుమారుడు దేవాంశ్తో కలిసి శ్రీహరికోటలోని ఇస్రో గ్యాలరీ నుంచి వీక్షించారు. ఇస్రో మాజీ ఛైర్మన్లు, సీనియర్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
ఇదిలాఉంటే.. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో స్కైరూట్ లాంచ్ కంట్రోల్ సెంటర్ లో సంబరాలు మిన్నంటాయి. ఇస్రో, స్కైరూట్ శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. శాస్త్రవేత్తలతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ప్రయోగం విజయవంతం కావడంతో వారికి అభినందనలు తెలిపారు. స్కైరూట్ విజయం.. దేశ యువతకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రయోగాన్ని నేను కూడా వీక్షించా. ఏళ్ల తరబడి స్కైరూట్ కృషికి ఫలితమే ఈ విజయం. అంతరిక్షంలో ప్రైవేటు రంగం ఆహ్వానంపై మొదట్లో సందేహాలొచ్చాయి. ప్రైవేటు సంస్థలు విజయం సాధించలేవని కొంతమంది అన్నారు. ప్రైవేటు రంగంపై ఉన్న సందేహాలను మీరు పటాపంచలు చేశారని మోదీ పేర్కొన్నారు.
మిషన్ ఆగమన్ పేరుతో స్కైరూట్ ఈ ప్రయోగం చేపట్టింది. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగం ఆర్బిటాల్ ప్రయోగాల యుగంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ మిషన్ కు ఆ పేరు పెట్టారు. ఈ ప్రయోగం ద్వారా రాకెట్లోని ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ వ్యవస్థల పనితీరును అంతరిక్ష ప్రయాణంలో పరీక్షించి కీలక సమాచారం సేకరించనున్నారు. ఈ సమాచారంతో రాబోయే రోజుల్లో వాణిజ్య ప్రయోగాల అవసరాలకు సాంకేతిక సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
