TVK Vijay : డీఎంకే దెబ్బకు దిగొచ్చిన సీఎం విజయ్.. ఆ టెండర్ రద్దు.. ఇద్దరు అధికారులు సస్పెండ్.. ఆరు గంటల్లోనే టెండర్ ముగియడంపై పెద్ద రచ్చ..
TVK Vijay : తమిళనాడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రధాన ప్రతిపక్షం డీఎంకే డేగకన్ను పెట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వం పరంగా ఎక్కడ ఏతప్పు జరిగినా దానిని హైలెట్ చేసి విజయ్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేఖత తీసుకొచ్చేందుకు డీఎంకే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా.. డీఎంకే టీవీకే ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. డీఎంకే ఆరోపణలపై సీఎం విజయ్ వెంటనే అలర్ట్ అయ్యారు. కాంట్రాక్ట్ ను రద్దు చేయడంతోపాటు ఇద్దరు అధికారులను విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు.
- Harish Thanniru
- Updated on- May 21, 2026 / 11:12 AM IST
TVK Vijay
- తమిళనాడులో టీవీకే సర్కార్‌పై అవినీతి ఆరోపణలు
- ఆరు గంటల టెండర్‌పై డీఎంకే అభ్యంతరాలు
- రూ.17 లక్షల కాంట్రాక్టును వెనక్కి తీసుకున్న సర్కార్
- విచారణకు ఆదేశం.. ఇద్దరు అధికారులు సస్పెండ్
TVK Vijay : తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష పార్టీ అయిన ద్రావిడ మున్నేట్ర కజగం (డీకేఎం) విమర్శల నేపథ్యంలో అలర్ట్ అయిన విజయ్… రూ.17లక్షల టెండర్ ను రద్దు చేశారు. అంతేకాదు.. ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొన్న ఇద్దరు అధికారులను విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తూ విజయ్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ అంశం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read : Gold silver Price Today : బంగారం, వెండి ధరల్లో బిగ్ ఛేంజ్.. ఎందుకిలా.. ఏపీ, తెలంగాణలో ధరలు ఇవే..
తమిళనాడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రధాన ప్రతిపక్షం డీఎంకే డేగకన్ను పెట్టింది. రాష్ట్రంలో ప్రభుత్వం పరంగా ఎక్కడ ఏతప్పు జరిగినా దానిని హైలెట్ చేసి విజయ్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేఖత తీసుకొచ్చేందుకు డీఎంకే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా.. టీవీకే ప్రభుత్వంపై డీఎంకే సంచలన ఆరోపణలు చేసింది.
తూత్తుకుడి జిల్లాలోని ఓ గ్రామంలో రూ.17లక్షల వ్యయంతో 3వేల లీటర్ల ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని విమర్శలు చేసింది. కేవలం ఆరు గంటల్లోనే టెండర్ ముగించడంపై టీవీకే సర్కారు మీద డీఎంకే విమర్శల దాడికి దిగింది. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, జలవనరుల శాఖల మంత్రి ఆనంద్ పై ప్రశ్నలు లేవనెత్తింది. దీంతో అప్రమత్తమైన సీఎం విజయ్ సర్కార్ ఆ టెండర్‌ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను విచారణ పూర్తయ్యేంత వరకు సస్పెండ్ చేసింది.
అసలు విషయానికి వస్తే.. తూత్తుకూడి జిల్లాలోని ఓ గ్రామంలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణంకోసం ప్రభుత్వం టెండర్లను పిలిచింది. వాస్తవానికి నిబంధనల ప్రకారం చూసుకుంటే మే13వ తేదీ నుంచి కాంట్రాక్టర్లకు టెండర్ వివరాలు అందుబాటులో ఉండాలి. కానీ, మే18వ తేదీ ఉదయం 9గంటలకు టెండర్ ప్లోచేసి, కేవలం ఆరు గంటల వ్యవధిలోనే క్లోజ్ చేశారు. మరుసటి రోజు సాయంత్రం 4గంటల కల్లా కాంట్రాక్ట్ కేటాయింపు కూడా పూర్తయింది.
ఇదే అంశాన్ని లేవనెత్తుతూ డీఎంకే అధికార పార్టీపై విమర్శల దాడికి దిగింది. కేవలం ఆరు గంటల్లోనే ఏ కంపెనీ అయినా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) ఎలా సిద్ధం చేయగలదని డీఎంకే నేతలు ప్రశ్నించారు. దీంతో ముఖ్యమంత్రి విజయ్ అప్రమత్తమై సదరు కాంట్రాక్ట్ ను రద్దు చేయడంతోపాటు.. విచారణకు ఆదేశించడం.. ఇద్దరు అధికారులను సస్పెండ్ చేయడం ప్రస్తుతం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడులో బొటాబొటీ మెజార్టీతో టీకేవీ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నూతన ప్రభుత్వం కావడంతోపాటు విజయ్‌కు పాలనాపరంగా పెద్దగా అనుభవం లేకపోవటంతో చిన్నచిన్న తప్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో డీఎంకే అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విజయ్ సర్కార్‌ను ఇరుకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
కొద్ది రోజుల క్రితమే జ్యోతిష్యుడైన రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ఓఎస్‌డీగా నియమించడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో విజయ్ తన నిర్ణయాన్ని మార్చుకొని రాధన్ పండిట్‌ను ఆ పదవి నుంచి కొన్ని గంటల్లోనే తప్పించారు. అయితే, తాజాగా.. కాంట్రాక్ట్ విషయంలో ఒకవైపు టీవీకే సర్కార్ విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. మరోవైపు విజయ్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది.
