Dmk Party: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. ఢిల్లీ సమావేశం బహిష్కరణ
ఇండియా కూటమి మీటింగ్ ను బైకాట్ చేసిన డీఎంకే పార్టీ(Dmk Party).
- V Santhosh Kumar
- Published on- June 4, 2026 / 08:14 PM IST
tamil nadu dmk party BOYCOTTS INDIA ALLIANCE MEETING
- ఇండియా కూటమి భేటీ బహిష్కరణ నిర్ణయం
- కాంగ్రెస్ పార్టీ తీవ్ర ద్రోహం చేసింది
- ఢిల్లీ సమావేశానికి డీఎంకే పూర్తి దూరం
Dmk Party: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్రంలో ఊహించని రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయి. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ‘ఇండియా’ (INDIA) కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే (Dmk Party) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 8వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరగబోయే ఇండియా కూటమి అత్యవసర సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు డీఎంకే అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ పాల్గొనే ఈ భేటీకి తాము వెళ్లే ప్రసక్తే లేదని చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం గురువారం స్పష్టం చేసింది.
Pawan Kalyan: తెలంగాణపై నా వైఖరి ఇదే.. పాత వీడియో షేర్ చేసిన పవన్ కళ్యాణ్.. వివాదానికి చెక్
తమిళనాడు ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ తమకు తీవ్ర ద్రోహం చేసిందని డీఎంకే నిప్పులు చెరిగింది. కాంగ్రెస్ అనుసరించిన వైఖరి వల్ల తమ పార్టీ శ్రేణులు తీవ్ర మనస్తాపానికి గురయ్యాయని, వారి భావోద్వేగాలను గౌరవిస్తూనే ఈ సమావేశానికి దూరంగా ఉండాలని డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ నిర్ణయించారని పార్టీ పేర్కొంది. కూటమి భాగస్వామ్య పక్షాల నుండి ఆహ్వానం అందినప్పటికీ, తమ కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని క్షమించేది లేదని డీఎంకే అధిష్ఠానం ఖచ్చితంగా తేల్చిచెప్పింది.
కూటమి ఏర్పడినప్పటి నుంచి స్టాలిన్ ఎంతో కీలక పాత్ర పోషించినప్పటికీ, తాజా వివాదంతో కాంగ్రెస్-డీఎంకే బంధంలో తీవ్ర అగాధం ఏర్పడింది. అయితే కూటమి భేటీని బహిష్కరించినప్పటికీ.. నీట్, వక్ఫ్ చట్టం, మరియు ‘ఒక దేశం-ఒకే ఎన్నికలు’ వంటి ప్రజా వ్యతిరేక విధానాలపై పార్లమెంట్‌లో తమ పోరాటం కొనసాగుతుందని డీఎంకే స్పష్టం చేసింది. ఇలాంటి అంశాలపై ఇతర పార్టీలు చేసే పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని చెబుతూనే, జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమికి డీఎంకే గట్టి షాక్ ఇచ్చింది.
