బీజేపీలో చేరేందుకు వచ్చాడు, పోలీసులను చూడగానే పారిపోయాడు.. అసలు విషయం తెలిశాక షాక్ తిన్న నేతలు

  • Publish Date - September 1, 2020 / 03:24 PM IST

చెన్నైలో బీజేపీ చేరికల కార్యక్రమంలో జరిగిన ఘటన ఆ పార్టీ నేతలను విస్మయానికి గురి చేసింది. అందరిని నోరెళ్ల బెట్టేలా చేసింది. పార్టీలో చేరికల విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియ చెప్పింది. అసలేం జరిగిందంటే.. మంగళవారం(సెప్టెంబర్ 1,2020) ఓ వ్యక్తి తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరేందుకు వచ్చాడు. సడెన్ గా అక్కడ పోలీసులు కనిపించే సరికి, ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో వేదికపై ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు ముఖ్యలు అవాక్కయ్యారు. అసలేం జరిగిందో అర్థం కాక షాక్ లో ఉండిపోయారు. తీరా అసలు విషయం తెలిసి నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు వారికి. ఆ పారిపోయిన వ్యక్తి ఓ పేరుమోసిన రౌడీ షీటర్. పోలీసులను చూడగానే భయంతో పారిపోయాడు.



బీజేపీలో చేరేందుకు వచ్చిన రౌడీషీటర్:
చెంగల్పట్టు జిల్లాకు చెందిన పేరు మోసిన రౌడీ షీటర్‌ సూర్య ఉదయం చెన్నైలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్ సమక్షంలో జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో కాషాయం కండువా కప్పుకునేందుకు వచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వేదికను చుట్టుముట్టారు. దీన్ని గమనించిన సూర్య అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి సహచరులలో నలుగురిని పోలీసులు అరెస్టు చేసి తరువాత బెయిల్‌పై విడుదల చేశారు.

6 హత్య కేసులతో పాటు 35కిపైగా కేసుల్లో నిందితుడు:
ఆరు హత్య కేసులతో సహా 35కి పైగా కేసుల్లో సూర్య నిందితుడిని పోలీసులు తెలిపారు. అతనిపై సీఆర్‌పీసీ సెక్షన్ 41 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్‌ను వివరణ కోరగా పార్టీలో చేరేందుకు వచ్చిన వారిలో చాలామంది నేపథ్యం తనకు తెలియదని తెలిపారు. ఇటీవల నార్త్ చెన్నైలో నేర చరిత్ర గలిగిన కాల్ వెట్టు రవి అనే వ్యక్తిని పార్టీలో చేర్చుకొని బీజేపీ ముఖ్య నాయకులు విమర్శల పాలైన సంగతి తెలిసిందే. రవి పలు హత్య కేసుల్లో నిందితుడు. కాగా బీజేపీలో చేరేందుకు కారులో వచ్చిన సూర్య, కారుని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఆ కారులో పోలీసులు తనిఖీలు చేశారు. కారులో దాచిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ని పోలీసులు సేకరించారు.



తన ఇంటికి సమీపంలోని కమ్యూనిటీ హాల్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకకు బీజేపీ అధ్యక్షుడు మురుగన్ హాజరయ్యారు. అదే సమయంలో పార్టీ కార్యకర్తలు పార్టీలో చేరికల కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంతా అనుకోకుండా జరిగిపోయింది. అదే సమయంలో రౌడీషీటర్ సూర్య అక్కడికి వచ్చాడు. ఇదే అదనుగా బీజేపీలో చేరాలని స్కెచ్ వేశాడు. అయితే, పోలీసులకు ముందే సమాచారం అందింది. సూర్యని పట్టుకునేందుకు పోలీసులు వచ్చారు. వారు రంగంలోకి దిగడంతో సూర్య అక్కడి నుంచి పారిపోయాడు.