Times Group Chairperson Indu Jain: టైమ్స్‌ గ్రూప్‌ చైర్మన్ కన్నుమూత..

Times Group Chairperson: టైమ్స్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌ ఇందూ జైన్‌(84)ను కరోనా మహమ్మరి కారణంగా కన్నుమూశారు. కోవిడ్ సంబంధిత సమస్యల కారణంగా ఆమె చనిపోయారు. 1999లో టైమ్స్ గ్రూప్‌ యాజమాన్య బాధ్యతలు చేపట్టిన ఇందూ జైన్.. 2000లో టైమ్స్‌ ఫౌండేషన్‌ను స్థాపించి సేవా కార్యక్రమాల్లో అడుగుపెట్టారు.

టైమ్స్ ఫౌండేషన్ ద్వారా వరదలు, తుఫానులు, భూకంపాల సమయంలో సేవలు అందించి ఉత్తమ ఎన్‌జీవోగా పేరు తెచ్చుకుని, పారిశ్రామిక రంగంలో ఎదిగారు. ఇందూ జైన్ చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో ఆమెను సత్కరించింది. 2016లో ఆమె పద్మభూషణ్ అందుకున్నారు.

1983లో ఏర్పాటైన ఫిక్కి లేడీస్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌ఎల్‌వో)కు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా వ్యవహరించిన ఇందూ.. భారతీయ భాషా సాహిత్యాభివృద్ధిని కాంక్షిస్తూ తన మామ సాహు శాంతి ప్రసాద్‌ జైన్‌ స్థాపించిన భారతీయ జ్ఞాన్‌పీఠ్ ట్రస్ట్‌కు 1999 నుంచి చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఈ ట్రస్ట్‌ ఏటా జ్ఞానపీఠ్ అవార్డులను అందజేస్తూ ఉంటుంది.

ఇందూ జైన్ 1936 సెప్టెంబర్ 8న ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో జన్మించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త అశోక్ కుమార్ జైన్‌ను వివాహం చేసుకోగా.. వీరికి సమీర్ జైన్, వినీత్ జైన్ సంతానం. ఆమె భర్త అశోక్ కుమార్ జైన్ గుండె సంబంధిత సమస్యలతో 1999లో అమెరికాలో మరణించారు. భర్త మరణం తర్వాత దేశంలోనే అతిపెద్ద మీడియా సంస్థ టైమ్స్ గ్రూప్ బాధ్యతలను ఇందూ జైన్ స్వీకరించారు.

ట్రెండింగ్ వార్తలు