Railway Travel Insurance : రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కేవలం 45 పైసలతో రూ.10 లక్షల బీమా.. ఎవరికి వర్తిస్తుంది? ఎలా పొందాలి?
Railway Travel Insurance : అక్టోబర్ 27 నుంచి రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలోనూ ప్రయాణ బీమా సదుపాయం అందుబాటులోకి వచ్చింది. కేవలం 45 పైసల ప్రీమియంతో అర్హులైన ప్రయాణికులు రూ.10 లక్షల వరకు బీమా పొందవచ్చు.
Railway Travel Insurance
Railway Travel Insurance : రైలు టికెట్ కోసం రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్తున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి. రైలు ప్రయాణంలో ప్రమాదం జరిగితే కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే బీమా సదుపాయం ఇకపై కౌంటర్లలో టికెట్లు తీసుకునే వారికి కూడా అందుబాటులోకి వచ్చింది. కేవలం 45 పైసల ప్రీమియంతో రూ.10 లక్షల వరకు బీమా కవరేజీ పొందే అవకాశం ఉంది.
Also Read : Gold Silver Prices Today : బంగారం కొనేవాళ్లకు బిగ్ అలర్ట్.. గోల్డ్ రేటులో ఊహించని మార్పులు.. కారణాలివే..
ఇప్పటివరకు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సదుపాయాన్ని రైల్వే శాఖ అక్టోబర్ 27 నుంచి రిజర్వేషన్ కౌంటర్లకూ విస్తరించింది. అయితే, ఈ బీమా తప్పనిసరి కాదు. ప్రయాణికులు కోరుకుంటేనే తీసుకోవచ్చు. మరి ఈ బీమా ఎవరికి వర్తిస్తుంది? టికెట్ తీసుకునేటప్పుడు ఏం చేయాలి? ప్రమాదం జరిగితే ఎంత పరిహారం లభిస్తుంది? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
రైల్వే ప్రయాణ బీమా పథకం పేరు ఆప్షనల్ ట్రావెల్ ఇన్సూరెన్స్ స్కీమ్ (OTIS). అంటే ప్రయాణికులు తమ ఇష్టానుసారం ఎంచుకునే బీమా సదుపాయం. ఒక్కో ప్రయాణికుడికి పన్నులతో కలిపి 45 పైసలు ప్రీమియంగా చెల్లించాలి. రైల్వే ప్రమాదం లేదా పాలసీలో పేర్కొన్న ఇతర అర్హతగల ఘటనల వల్ల మరణం, అంగవైకల్యం లేదా గాయాలు సంభవిస్తే నిబంధనల ప్రకారం పరిహారం పొందవచ్చు. గతంలో ఐఆర్సీటీసీ వెబ్సైట్, యాప్ ద్వారా రిజర్వేషన్ చేసుకునే వారికి ఈ సదుపాయం ఉండేది. ఇప్పుడు రైల్వే స్టేషన్లలోని ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) కౌంటర్లలో టికెట్లు తీసుకునే వారికి కూడా ఈ అవకాశం కల్పించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రమాద తీవ్రతను బట్టి బీమా వర్తిస్తుంది.. అదెలా అంటే..
♦ మరణం సంభవిస్తే రూ.10 లక్షల వరకు
♦ శాశ్వత పూర్తి అంగవైకల్యం కలిగితే : రూ.10 లక్షల వరకు.
♦ శాశ్వత పాక్షిక అంగవైకల్యం కలిగితే: రూ.7.5 లక్షల వరకు
♦ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందితే: రూ.2 లక్షల వరకు.
♦ మృతదేహాన్ని తరలించేందుకు: రూ.10,000 వరకు.
♦ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ప్రమాద స్వభావం, జరిగిన నష్టం, వైకల్యం తీవ్రత, బీమా పాలసీ నిబంధనల ఆధారంగా పరిహారం నిర్ణయిస్తారు.
కౌంటర్లో టికెట్ తీసుకునేటప్పుడు ఏం చేయాలి?
♦ బీమా కావాలని చెప్పాలి: రిజర్వేషన్ కౌంటర్లో టికెట్ తీసుకునేటప్పుడు బీమా సదుపాయాన్ని ఎంచుకోవాలి. టికెట్ తీసుకున్నంత మాత్రాన బీమా ఆటోమేటిక్‌గా వర్తించదు.
♦ డిజిటల్ చెల్లింపు చేయాలి: టికెట్ ఛార్జీతో పాటు 45 పైసల బీమా ప్రీమియాన్ని కూడా డిజిటల్ పద్ధతిలో చెల్లించాలి. యూపీఐ, కార్డు లేదా అందుబాటులో ఉన్న ఇతర డిజిటల్ చెల్లింపు విధానాలను ఉపయోగించవచ్చు. నగదు చెల్లింపుతో ఈ బీమాను పొందలేరు.
♦ సరైన మొబైల్ నంబర్ ఇవ్వాలి: బీమా పాలసీ జారీ కోసం ప్రయాణికుడి మొబైల్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలి.
♦ పాలసీ వివరాలను భద్రపరుచుకోవాలి: బీమా తీసుకున్న తర్వాత పాలసీ వివరాలు నమోదైన మొబైల్ నంబర్‌కు పంపిస్తారు. భవిష్యత్తులో అవసరమయ్యే అవకాశం ఉన్నందున వాటిని భద్రపరుచుకోవాలి.
వెయిటింగ్ లిస్ట్ టికెట్లకు కూడా వర్తిస్తుందా?
బుకింగ్ సమయంలో కన్ఫర్మ్ అయిన (CNF), ఆర్ఏసీ (RAC), పాక్షికంగా కన్ఫర్మ్ అయిన (PartCNF) రిజర్వేషన్ టికెట్లకు ఈ సదుపాయం వర్తిస్తుంది. ఒకే పీఎన్ఆర్ (PNR)పై కొంతమందికి కన్ఫర్మ్ టికెట్లు, మరికొందరికి వెయిటింగ్ లిస్ట్ ఉన్న సందర్భాల్లోనూ వర్తించే అర్హతలను బట్టి బీమా పొందవచ్చు. అయితే, సాధారణ అన్రిజర్వ్డ్ టికెట్లకు ఈ పథకం వర్తించదు. ఐదేళ్లలోపు పిల్లలు ప్రత్యేక బెర్త్ లేదా సీటు లేకుండా ప్రయాణిస్తే వారికి ఈ బీమా వర్తించదు. మిగిలిన సందర్భాల్లోనూ పాలసీ నిబంధనలు, అర్హతలను పరిశీలించాలి.
టికెట్ రద్దు చేస్తే బీమా ప్రీమియం సంగతేంటి?
ప్రయాణం రద్దు చేసుకుని టికెట్ క్యాన్సిల్ చేసుకునే సందర్భంలో బీమా ప్రీమియంపై కూడా నిబంధనలు వర్తిస్తాయి. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, చెల్లించిన 45 పైసల ప్రీమియంలో 9 పైసలు మినహాయించవచ్చు. దీనికి అదనంగా రైల్వే సాధారణ టికెట్ రద్దు ఛార్జీలు కూడా వర్తించవచ్చు.
