Donald Trump: చర్చలు విఫలమైతే మళ్ళీ దాడులు.. ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
అమెరికా(Donald Trump), ఇరాన్ దేశాల మధ్య స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో ఆదివారం చారిత్రక శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి.
Trump warns Iran that attacks will resume if peace talks fail.
- అమెరికా ఇరాన్ శాంతి చర్చలు.
- విఫలమైతే దాడులని ట్రంప్ హెచ్చరిక.
- మధ్యవర్తులుగా పాకిస్థాన్ మరియు ఖతార్.
Donald Trump: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో ఆదివారం చారిత్రక శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ చర్చలు విఫలమైతే ఇరాన్‌పై మళ్లీ సైనిక దాడులకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా లెబనాన్‌లో ఇరాన్ మద్దతుతో నడుస్తున్న ప్రాక్సీ గ్రూపుల దాడులను తక్షణమే ఆపాలని, లేనిపక్షంలో గత వారం కంటే మరింత భీకరమైన దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని తన ట్రూత్ సోషల్ వేదికగా స్పష్టం చేశారు.
వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధిని మూసివేసేందుకు ప్రయత్నిస్తే ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని, ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని టోల్ ఫీజు వసూలు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఈ చర్చల గురించి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ, ఇరుదేశాల మధ్య సంబంధాలను సరికొత్త దిశగా తీసుకెళ్లేందుకు ఇదొక చారిత్రక అవకాశమని అభివర్ణించారు. శాంతితో కూడిన కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తామా లేదా పాత వైరాన్నే కొనసాగిస్తామా అనేది ఈ చర్చల ఫలితాలపైనే ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ ఉన్నత స్థాయి శాంతి చర్చలలో అమెరికా ప్రతినిధులుగా జేడీ వాన్స్‌తో పాటు జారెడ్ కుష్నర్, స్టీవ్ విట్కాఫ్ పాల్గొనగా, ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, ఎంబీ గాలిబాఫ్ నేతృత్వం వహిస్తున్నారు. ఇరుపక్షాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పాకిస్థాన్, ఖతార్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఈ చర్చల వేళ, ట్రంప్ చేసిన హెచ్చరికలు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి.
