×
Ad

TVK Vijay Poll Manifesto: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన విజయ్.. రుణమాఫీతో పాటు మరెన్నో

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ఈ సారి తమిళనాట సినీ నటుడు విజయ్ పోటీ చేయబోతున్నారు. ఈక్రమంలో నేడు ఆయన తన పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు.

TVK Vijay announces tn assembly elections poll promises at tanjavuru rally

TVK Vijay Poll Manifesto: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. హీరో, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఈ క్రమంలో ఆయన కీలకమైన ఎన్నికల హామీలను ప్రకటించారు. రైతుల పిల్లలకు మంచి విద్య అందించేందుకు ఆర్థిక సాయం చేస్తామని, రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తమిళనాడులోని తంజావూరు నగరంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో విజయ్ తన పార్టీ మేనిఫెస్టోను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మత్స్యకారులకు భద్రతతో పాటు, పారదర్శకమైన, అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని, అలాగే పేద రైతుల బిడ్డల చదువుకు అయ్యే ఖర్చును తమ పార్టీయే భరిస్తుందని విజయ్ హామీ ఇచ్చారు. వీటితో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలను ప్రకటించిన ఆయన.. రాష్ట్రాన్ని పాలించేందుకు తనకు ఒక అవకాశం ఇవ్వాలని తమిళనాడు ప్రజలను అభ్యర్థించారు.

విజయ్ మాట్లాడుతూ.. “మిగతా వారికి ఇవి సాధారణ ఎన్నికల్లా అనిపించవచ్చు, కానీ నాకు, నన్ను ప్రేమించే ప్రజలకు ఇది ఒక భావోద్వేగం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ జాతీయ పార్టీలతో పాటు రాష్ట్రంలోని ఇతర పార్టీలను కూడా ఓడిస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు. తన సినిమా ‘జననాయగన్’ గురించి ప్రస్తావిస్తూ.. “చాలా మంది నాకు మద్దతుగా గొంతు ఎత్తారు. మన ముఖ్యమంత్రి కూడా మద్దతు పలికారు, అందుకు వారికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారూ.. మీరు నన్ను మౌనంగా ఉంచడానికి ప్రయత్నించవచ్చు, కానీ నేడు ప్రతి ఇంట్లో ఓ విజయ్ ఉన్నాడు. వారిని మీరు మౌనంగా ఉంచలేరు. వారు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు” అని పేర్కొన్నారు.

చివరగా ఆయన డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. “తమిళనాడు ఎన్నికల్లో పోటీ ప్రధానంగా విజయ్, స్టాలిన్ మధ్యే ఉంది. తమిళనాడు అంటే విజయ్.. విజయ్ అంటే తమిళనాడు. యుద్ధం టీవీకే, డీఎంకే మధ్యనే జరగనుంది. నేడు రాష్ట్రంలో ఒక నకిలీ మోడల్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రస్తుతం తమిళనాడును ఒక ‘స్టాండ్-అప్ కామెడీ’ ప్రభుత్వం పాలిస్తోంది. ఈ ఎన్నికలు చారిత్రాత్మకం కావడమే కాకుండా అద్భుతంగా నిలుస్తాయి” అని విజయ్ వ్యాఖ్యానించారు.