TVK Vijay Assets : నామినేషన్ దాఖలు చేసిన విజయ్.. ఆయన ఆస్తి ఎన్ని వందల కోట్లో తెలుసా..!

TVK Vijay Assets : టీవీకే అధినేత నేడు నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. మరి ఆయన పేరు మీద ఎంత ఆస్తి ఉందో తెలుసా...

TVK Vijay files nomination and declares Rs 404 crore assets in poll affidavit

TVK Vijay Assets : ప్రముఖ నటుడు విజయ్.. సొంతంగా పార్టీ పెట్టడమే కాక త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. ఇక విజయ్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో మార్చి 30, సోమవారం ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. దీంట్లో ఆయనకు రూ. 404.58 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ప్రకటించారు.

అఫిడవిట్ ప్రకారం, విజయ్ మొత్తం ఆస్తుల విలువ రూ. 4,04,58,57,196 గా ఉంది. దీనిలో బ్యాంక్ డిపాజిట్లు, పెట్టుబడులు, వాహనాలు, ఇతర ఆస్తుల వివరాలు సమగ్రంగా ఉన్నాయి. ఈ అఫిడవిట్ ప్రకారం చూసుకుంటే విజయ్ వద్ద BMW 530, BMW i7, Toyota Lexus 350, Toyota Vellfire వంటి లగ్జరీ కార్లు, ఇతర వాహనాలు, బైక్‌లు కూడా ఉన్నాయి. విజయ్ సమర్పించిన అఫిడవిట్‌లో గత ఆర్థిక సంవత్సరాల ఆదాయ వివరాలు కూడా ఉన్నాయి. వాటి వివరాలు:

  • 2024–25లో రూ. 184.53 కోట్లు
  • 2023–24లో రూ. 105.69 కోట్లు
  • 2022–23లో రూ. 198.71 కోట్లు
  • 2021–22లో రూ. 237.46 కోట్లు
  • 2020–21లో రూ. 8.04 కోట్లు ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు.

వీటితో పాటు విజయ్ భార్య 2020–21 ఆర్థిక సంవత్సరానికి రూ. 6,13,520 ఆదాయం పొందినట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు.

టీవీకే (TVK) అధినేత విజయ్.. చెన్నైలోని పెరంబూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఏప్రిల్ 23న జరిగే ఎన్నికల్లో తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని, పార్టీ గుర్తు ‘విసిల్’ కు ఓటు వేయాలని ప్రజలను కోరారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఓపెన్ టాప్ ప్రచార వాహనంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, డీఎంకే ఒక “దుష్ట శక్తి” అని తన ఆరోపణను మరోసారి పునరుద్ఘాటించారు.