Lok Sabha Assembly Seats Increase : లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంపు.. ఏపీ, తెలంగాణలో ఎన్ని సీట్లు పెరుగుతాయంటే..
Lok Sabha Assembly Seats Increase : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్ సభ, అసెంబ్లీ స్థానాలను పెంచాలని నిర్ణయించుందని తెలుస్తోంది.
- Dharani Pilli
- Published On : March 24, 2026 / 07:27 AM IST
Union government to increase Lok Sabha and State Assembly seats Increase 50 pc upto 2029 general elections
Lok Sabha Assembly Seats Increase : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ, అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని నిర్ణయించింది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ బిల్లు చట్టంగా మారితే.. ఇప్పటివరకు ఉన్న పార్లమెంటు స్థానాలు 543 నుంచి 816కి పెరుగుతాయి. అలాగే రాష్ట్రాలన్నింటిలో కలిపి మొత్తం 4,123 ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య 6,185కి పెరుగుతుంది.
మిగతా రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి.
- ఆంధ్రప్రదేశ్: ప్రస్తుతం ఏపీలో ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి పెరుగుతాయి. అలాగే లోక్‌సభ స్థానాల సంఖ్య 25 నుంచి 38కి పెరుగుతుంది.
- తెలంగాణ: ఇటు తెలంగాణలో కూడా అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి చేరుతాయి. అలాగే లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కి చేరే అవకాశం ఉంటుందని అంటున్నారు.
ఈ సమాచారాన్ని సోమవారం సాయంత్రం కేంద్రం.. ఎన్డీయే (NDA) సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు వెల్లడించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్‌ల నేతృత్వంలో ఈ భేటీ జరిగింది.
ఇదే అంశంపై కాంగ్రెసేతర విపక్షాలతోనూ ప్రత్యేకంగా భేటీ నిర్వహించారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ అంశంపై కాంగ్రెస్‌తో మాట్లాడే అవకాశం ఉంది. అయితే నియోజకవర్గాల సంఖ్య పెంచడానికన్నా ముందుగా.. మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లులను ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇవి ఆమోదం పొందిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి సీట్ల పెంపు కార్యక్రమాన్ని పూర్తి చేసి 2029 ఎన్నికల్లో వాటిని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
