PM Modi: యుద్ధ ప్రభావం చాలా కాలం ఉంటుంది: ప్రధాని మోదీ కీలక ప్రకటన.. జనం ప్రిపేర్ అవ్వాల్సిందేనా?
గల్ఫ్ దేశాల్లో కోటి మందికి పైగా భారత కార్మికులు ఉన్నారని, వారంతా యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నారని చెప్పారు.
- Naveen
- Published On : March 24, 2026 / 04:38 PM IST
PM Modi: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధ ప్రభావం చాలా కాలం ఉంటుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో భారత దేశం ఐక్యంగా ఉండాలని సూచించారు. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని ప్రధాని మోదీ రాజ్యసభలో తెలిపారు.
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశ ప్రజలు ఎలాంటి సవాల్ కైనా సిద్ధంగా ఉండాలని రాజ్యసభ వేదికగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని తేల్చి చెప్పారు. కరోనా సమయంలో చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వాలు జట్టుగా పనిచేసి ఈ సంక్షోభం నుంచి బయటపడాలని ఆయన కోరారు. వలస కార్మికులను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
గల్ఫ్ దేశాల్లో కోటి మందికి పైగా భారత కార్మికులు ఉన్నారని, వారంతా యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నారని చెప్పారు. ఇప్పటివరకు 3.75 లక్షల మంది భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చామన్నారు. భారతీయులను రక్షించడమే మా ప్రభుత్వ బాధ్యత అని ప్రధాని మోదీ చెప్పారు.
గల్ఫ్ దేశాల్లో యుద్ధం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని, మన ముందు చాలా సవాళ్లు ఉన్నాయని మోదీ అన్నారు. గల్ఫ్ దేశాలతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
ఇంధన భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 41 దేశాల నుంచి ఇంధనం కొంటున్నామని వివరించారు. గృహ అవసరాలకు ఎల్పీజీ సరఫరా పెంచుతున్నామన్నారు. సామాన్య ప్రజలపై యుద్ధ ప్రభావం పడుతోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఎప్పుడూ శాంతి కోరుకుంటుందని తేల్చి చెప్పారు. యుద్ధ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వంట గ్యాస్, పెట్రోల్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకు యుద్ధం ప్రమాదకరంగా మారిందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థకు గల్ఫ్ వార్ పెద్ద పరీక్ష అన్నారు. భారత్ పై ఆర్థిక మాంద్యం ప్రభావం లేకుండా చూస్తున్నామని వివరించారు. హర్మూజ్ జలసంధి మూసేయడం సరికాదన్నారు. పౌరులు, మౌలిక స్థావరాలపై దాడులను వ్యతిరేకిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. భారతీయ నౌకల రాకపోకలకు మార్గం సుగమం చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read: మత మార్పిడిలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ‘ఆ మతంలోకి మారితే SC హోదా రద్దు’
