బీజేపీలో చేరిన 24 గంటల్లోనే ఏకంగా రాజకీయాలకే గుడ్ బై, మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ సంచలన నిర్ణయం

  • Publish Date - July 23, 2020 / 11:05 AM IST

వెస్ట్ బెంగాల్ కు చెందిన భారత్ ఫుట్ బాల్ మాజీ క్రీడాకారుడు మెహ్తాబ్ హుస్సేన్ యూటర్న్ తీసుకున్నాడు. ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పాడు. బీజేపీలో చేరి 24 గంటలు కూడా గడవకముందే పాలిటిక్స్ నుంచి క్విట్ కావడం సంచలనంగా మారింది. భారత ఎక్స్ పుట్ బాలర్ మెహ్తాబ్ హుస్సేన్ దీనిపై స్పందించాడు. రాజకీయాల నుంచి వైదొలగాలనుకోవడం తన వ్యక్తిగత నిర్ణయం అన్నాడు. రాజకీయ పార్టీలో చేరుతూ తాను తీసుకున్న నిర్ణయం పట్ల తన కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు బాధ, ఆవేదన వ్యక్తం చేశారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపాడు.

మంగళవారం బీజేపీలో చేరిక:
మెహ్తాబ్ హుస్సేన్ కోల్ కతా మైదాన్ జట్టుకి మిడ్ ఫీల్డ్ జనరల్ ప్లేయర్ గా ఆడాడు. ఈస్ట్ బెంగాల్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరించాడు. రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న మెహ్తాబ్, మంగళవారం(జూలై 21,2020) బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో బీజేపీలో చేరాడు. బీజేపీ కండువా కప్పుకున్నాడు. భారత్ మాతాకీ జై నినాదాలు కూడా చేశాడు.

24గంటల్లోనే యూటర్న్, రాజకీయాలకు గుడ్ బై:
ఇంతలో ఏం జరిగిందో కానీ, సడెన్ గా అంటే, 24 గంటలు గడవకముందే ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు మెహ్తాబ్ ప్రకటించాడు. ”ఈ రోజు నుంచి నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు నా శ్రేయోభిలాషులకు నేను క్షమాపణ కోరుతున్నా” అంటూ మెహ్తాబ్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్టు పెట్టాడు. రాజకీయాలకు దూరంగా ఉండాలని తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎవరి ప్రోద్బలం, ఒత్తిళ్లు లేవు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం” అని మెహ్తాబ్ స్పష్టం చేశాడు.

నేను రాజకీయాల్లోకి రావడం వారికి ఇష్టం లేదు:
మరింత ఎక్కువ మంది ప్రజలకు చేరువ కావడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీలో చేరిన సమయంలో మెహ్తాబ్ చెప్పాడు. ”ఈ కష్ట కాలంలో ప్రజలకు అండగా ఉండాలని అనుకున్నా. ప్రజల కష్టాలు చూసి నాకు నిద్ర కూడా పట్టడం లేదు. ఈ కారణంతోనే నేను సడెన్ గా రాజకీయాల్లోకి వచ్చాను” అని మెహ్తాబ్ చెప్పాడు. కాగా, ఎవరి కోసం అయితే నేను రాజకీయ నాయకుడిని అయ్యి సేవ చేయాలని అనుకున్నానో వారే నా నిర్ణయాన్ని తప్పుపట్టారు. నేను రాజకీయాల్లోకి వెళ్లి ఉండాల్సింది కాదని అన్నారు. నన్ను రాజకీయ నాయకుడిగా చూడాలని వారు అనుకోవడం లేదు” అని మెహ్తాబ్ తెలిపాడు.

నా భార్య, పిల్లలకే ఇష్టం లేదు:
నేను రాజకీయాల్లోకి రావడం నా భార్య, పిల్లలను కూడా బాధించింది అని మెహ్తాబ్ వాపోయాడు. నా భార్య మౌమితా.. పిల్లలు జిదాన్, జవ్వి.. నా
నిర్ణయాన్ని సమర్థించ లేదు. నా స్నేహితులు, మద్దతుదారులు బాధపడినట్టే వారూ బాధపడ్డారు. ఈ నేపథ్యంలోనే రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. మెహ్తాబ్ భారత ఫుట్ బాల్ జట్టు తరఫున 30 మ్యాచులు ఆడాడు. రెండు గోల్స్ చేశాడు. మోహన్ బగాన్ జట్టు తరఫున ఆడుతున్న సమయంలో 2018-19 సీజన్ లో ఫుట్ బాల్ నుంచి క్విట్ అయ్యాడు.

తృణమూల్ బెదిరించిందని బీజేపీ ఆరోపణలు:
ఈ వ్యవహారంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. మెహ్తాబ్ యూటర్న్ వెనుక వెస్ట్ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ హస్తం ఉందని ఆరోపించింది. అధికార పార్టీ నేతల నుంచి వచ్చిన బెదిరింపులతో మెహ్తాబ్ హుస్సేన్ రాజకీయాల నుంచి వైదొలిగినట్టు బీజేపీ నేతలు చెప్పారు. ఇలాంటి ఘటనలు గతంలో అనేకం జరిగాయన్నారు. ఇలాంటి నీచమైన ట్రిక్స్ ప్లే చేసి తృణమూల్ కాంగ్రెస్, ప్రజల మద్దతును మరింతగా కోల్పోతుందని బీజేపీ సెక్రటరీ జనరల్ సయాతన్ బసు మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు వెస్ట్ బెంగాల్ లో చట్టం లేదని చెప్పడానికి నిదర్శనం అని బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జైప్రకాశ్ మజుందార్ అన్నారు. కాగా, బీజేపీ చేసిన ఆరోపణలను అధికార పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. అందులో వాస్తవం లేదన్నారు. తాము ఎవర్నీ బెదిరించ లేదన్నారు.

ట్రెండింగ్ వార్తలు