Tulsi Sunday : ఆదివారం తులసి మొక్కకు నీరు పోయడం, ఆకులు కోయడం చేస్తున్నారా.. ఇక మీ ఇంట దరిద్ర దేవత తాండవం..!

Tulsi Sunday : తులసి చెట్టుకు పూజ చేసే సమయంలో కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి.

avoid Watering Tulsi Plant on Sunday Scripture explain the reason behind this

Tulsi Sunday : హిందూ ధర్మం, పురాణాల్లో తులసికి చాలా ప్రాముఖ్యతతో పాటు పవిత్రత, పూజ్య స్థానం ఉంది. హిందూ మహిళలు చాలా వరకు నిత్యం తులసి పూజ చేస్తారు. పురాణాలు, హిందూ సంప్రదాయం ప్రకారం, ప్రతి ఇంటి ఆవరణలో తులసి మొక్క తప్పకుండా ఉంటుంది. ప్రతి రోజు తులసి మొక్కకు నీరు పోసి, పూజ చేస్తారు. దీని వల్ల చాలా మంచి జరుగుతుందని.. శుభప్రదమని నమ్ముతారు. అయితే కేవలం మతపరంగానే కాకుండా, ఆయుర్వేదంలో కూడా తులసికి చాలా ప్రత్యేకత ఉంది. తులసికి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పరగడుపున తులసి ఆకులను తినడం చాలా మంచిది అంటారు.

ఆధ్యాత్మికంగా చూసుకుంటే.. వారంలోని కొన్ని రోజుల్లో అలానే నెలలోని కొన్ని తిథుల్లో తులసి చెట్టును తాకడం, నీరు పోయడం వంటివి చేయకూడదని పండితులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఆదివారాల్లో, ఏకాదశి తిథి నాడు తులసి మొక్కకు నీరు పోయడం నిషిద్ధం. అలానే ఆయా రోజుల్లో తులసి ఆకులను కూడా కోయకూడదని ఒక నియమం ఉంది. మరి ఈ ఆచారాల వెనక ఉన్న మతపరమైన నమ్మకాలు, కారణాలు ఏంటంటే..

ఆదివారం తులసి దేవి ఉపవాస దినం:

హిందూ మత విశ్వాసాల ప్రకారం, తులసి దేవి శ్రీమహావిష్ణువుకు పరమ భక్తురాలు.. స్వయంగా ఆయన ప్రియమైన భార్య (లక్ష్మీ స్వరూపిణి). పురాణాల ప్రకారం ఆదివారాల్లో, తులసి దేవి విష్ణుమూర్తి కోసం చాలా కఠినమైన వ్రతం పాటిస్తుంది. కనుక ఆదివారం నాడు తులసి మొక్కకు నీరు పోస్తే.. తులసి దేవి ఉపవాసం భంగమవుతుందని నమ్ముతారు. ఫలితంగా తులసి దేవతకు కోపం వచ్చి, ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని విశ్వాసం. అందుకే ఆదివారం నాడు తులసి మొక్కకు నీరు పోయకూడదు.

విష్ణు పూజ-విశ్రాంతి

ఆదివారం విష్ణుమూర్తిని కొలవడానికి పరమ పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున తులసి మాత యోగనిద్రలో.. అంటే విష్ణు ధ్యానంలో లీనమై ఉంటుంది. కనుక ఆదివారం నాడు తులసి మొక్కకు నీరు పోసినా.. ఆకులను కోసినా.. తులసి మాత ధ్యానానికి ఆటంకం కలుగుతుందని భక్తుల నమ్మిక.

ఏకాదశి నాడు కూడా..

ఆదివారం లాగే, ప్రతి నెలా రెండు సార్లు వచ్చే ఏకాదశి రోజున కూడా తులసి మొక్కకు నీరు పోయకూడదు. అలానే తులసి ఆకులను తెంపడం నిషిద్ధం. ఎందుకంటే ఏకాదశి రోజున తులసి దేవి హరి (విష్ణువు) కోసం నిర్జల ఏకాదశి వ్రతం ఆచరిస్తుంది. నీరు పోస్తే తులసి మాత ఉపవాస దీక్షకు భంగం కలిగినట్లు భావిస్తారు. అందుకే ఏకాదశి నాడు తులసి మొక్కకు నీరు పోయకూడదు.. ఆకులు కోయకూడదంటారు పండితులు.

ఆకులు కోస్తే కలిగే నష్టాలు

ఆదివారాలు లేదా ఏకాదశి రోజులలో తులసి ఆకులను కోయడం వల్ల ఇంటికి పేదరికం, ఆర్థిక నష్టం కలుగుతుందని నమ్ముతారు. దీనివల్ల విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహం తొలగిపోతుందని, కుటుంబంలో కలహాలు ఏర్పడవచ్చని కూడా అంటారు.

పరిహారం

ఆదివారం, ఏకాదశి రోజుల్లో తులసి ఆకులను కోయకూడదంటే.. అందుకు ముందు రోజు వాటిని కోసి భద్రపరుచుకోవాలి. అలానే తులసి ఆకులు ఎండినా కూడా వాటి పవిత్రత తగ్గదు. కనుక ముందుగా కోసిన ఆకులను ఆదివారం, ఏకాదశి నాడు పూజలో వినియోగించవచ్చు.

అలానే ఆదివారం నీరు పోయకపోయినా, సాయంత్రం తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే అత్యంత శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు.

గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv ధ్రువీకరించడం లేదు.