Hanuman Jayanti 2026 : మే 12 హనుమాన్ జయంతి+మంగళవారం.. అత్యంత శుభప్రదం.. ఇలా పూజిస్తే.. ఇక మీకు తిరుగుండదు..!

Hanuman Jayanti 2026 : మే 12 మంగళవారం నాడు హనుమాన్ జయంతి. మరి ఆ రోజు హనుమంతుడిని ఎలా పూజించాలి.. పాటించాల్సిన నియమాలు..

hanuman jayanti may 2026 significance puja muhurat prasad and fasting details

Hanuman Jayanti 2026 : ధైర్యానికి, విజయానికి ప్రతీకగా హనుమంతుడిని కొలుస్తారు. ఇక ప్రతి ఏటా రెండు సార్లు హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇప్పటికే ఏప్రిల్ నెలలో ఒకసారి హనుమాన్ జయంతి జరుపుకోగా.. ఇప్పుడు మే నెలలో మరోసారి హనుమాన్ జయంతి రానుంది. మే 12న హనుమాన్ జయంతి. అయితే ఈ సారి ఈ పర్వదినానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సారి హనుమాన్ జయంతి.. ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైన మంగళవారం నాడు వస్తుంది. మరి ఇంతకు పూజా సమయం ఎప్పుడు.. పాటించాల్సిన నియమాలు వంటి వాటికి సంబంధించిన వివరాలు ఇక్కడ..

తిథి:

వైశాఖ బహుళ దశమి సూర్యోదయానికి మే 12న ఉంది కాబట్టి ఆ 2026 మే 12వ తేదీ, మంగళవారం నాడు హనుమజ్జయంతిని జరుపుకోవాలి. హనుమాన్ జయంతి జరుపుకోవాలనుకునేవారు.. తమ ఇంట్లోని పూజా గదిని మే 6, 7, 10 లేదా 11 తేదీల్లో శుభ్రం చేసుకోవచ్చు. మే 8, 9 తేదీలలో శుభ్రం చేయకూడదు.

పూజా నియమాలు:

  • హనుమాన్ జయంతి నాడు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. గడపను పసుపు, కుంకుమతో అలంకరించి ముగ్గులు పెట్టుకోవాలి.
  • పూజ కోసం పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటం లేదా విగ్రహాన్ని ఉపయోగించవచ్చు.
  • ఒకవేళ అవి లేకపోతే, హనుమంతుడు ఉండే శ్రీరామ పట్టాభిషేకం పటాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు.

పూజా విధానం:

ప్రథమ పూజ: హనుమాన్ జయంతి పూజలో భాగంగా ముందుగా శ్రీరాముని పూజించాలి. శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోవడం లేదా “శ్రీరామ” అని నామస్మరణ చేస్తూ అక్షింతలు, పూలతో పూజించాలి.

హనుమత్ పూజ: శ్రీరాముడిని పూజించిన తర్వాత ఆంజనేయ స్వామికి పూజ చేయాలి. దీని కోసం హనుమాన్ చాలీసా, హనుమత్ దండకం లేదా అష్టోత్తర శతనామావళిని పఠించాలి.

మంత్రం: హనుమాన్ జయంతి నాడు.. “ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్” అనే శ్లోకాన్ని పఠిస్తే విశేషమైన ఫలితాలు అందుకుంటారు.

ప్రత్యేక ఆచారాలు:

తమలపాకుల పూజ: హనుమంతుడికి తమలపాకులంటే చాలా ప్రీతి. అందుకే హనుమాన్ జయంతి నాడు.. ఆంజనేయుడికి 108 తమలపాకులతో అష్టోత్తరం చదువుతూ పూజ చేయవచ్చు. లేదంటే ఆకులను మాలగా గుచ్చి సమర్పించవచ్చు.

నవధాన్యాల దీపం: పూజలో భాగంగా.. ఒక తమలపాకుపై నవధాన్యాలు పోసి, దానిపై మట్టి ప్రమిద ఉంచాలి. సింధూరం మరియు ఆవునెయ్యి/నువ్వుల నూనెతో కలిపిన ఐదు వత్తులతో (పంచ వత్తులు) దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించిన దీపం గ్రహ దోషాలను తొలగిస్తుంది.

సింధూర అక్షింతలు: బియ్యంలో ఆవునెయ్యి మరియు సింధూరం కలిపి అక్షింతలను తయారు చేసుకుని పూజకు వాడాలి.

నైవేద్యం, దానం:

నైవేద్యం: హనుమంతుడికి ఎంతో ఇష్టమైన అరటి పండ్లతో పాటు.. పానకం, వడపప్పు, చలిమిడి, అప్పాలు, వడలు వంటి వాటిని స్వామికి సమర్పించాలి.

దానాలు: ఈ రోజున గొడుగు, చెప్పులు, వస్త్రాలు, నీరు, మజ్జిగ, మామిడి పండ్లు లేదా పుస్తకాలు దానం చేయడం శుభప్రదం.

ఆహార నియమాలు:

హనుమాన్ జయంతి నాడు పూర్తి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. పూజ ముగిసే వరకు పాలు, పండ్లు తీసుకోవచ్చు. పూజ తర్వాత అల్పాహారం లేదా భోజనం చేయవచ్చు.

గమనిక : పాఠకుల ఆసక్తి మేరకు ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv నిర్ధారించడం లేదు.