Hanuman Jayanti 2026 : ఏడాదికి 2 సార్లు హనుమాన్ జయంతి.. కారణం ఏంటి.. అసలైన హనుమాన్ జయంతి ఎప్పుడు..?

Hanuman Jayanti 2026 : ప్రతి ఏటా రెండు సార్లు హనుమాన్ జయంతి జరుపుకుంటారు. అయితే వీటిల్లో అసలైన హనుమాన్ జయంతి ఎప్పుడు.. ఎందుకు రెండు సార్లు జరుపుకుంటున్నామంటే...

hanuman jayanti 2026 why does it come twice in a year

Hanuman Jayanti 2026 : హిందువులు కొలిచే దేవుళ్లలో హనుమంతుడికి ప్రత్యేక స్థానముంది. దేశంలో హనుమంతుడి గుడి లేని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. ధైర్యం, కార్యసిద్ధిని, శత్రుజయాన్ని అందించే ఆంజనేయ స్వామిని పూజిస్తే.. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా భయపడరని.. విజయం లభిస్తుందని పురాణాల్లో చెప్పారు. మరి అంతటి శక్తివంతుడైన ఆంజనేయుడికి సంబంధించి తప్పకుండా జరుపుకునే పండుగ హనుమాన్ జయంతి. అయితే ప్రతి సంవత్సరం రెండుసార్లు హనుమాన్ జయంతి జరుపుకుంటాం. ఒకటి.. చైత్ర మాసంలో.. శ్రీరామనవమి తరువాత సరిగ్గా ఆరు రోజులకు వస్తుంది. రెండో హనుమాన్ జయంతి వైశాఖ మాసం బహుళ పక్షంలో.. దశమి, పూర్వాభద్ర నక్షత్రం రోజున జరుపుకుంటారు. ఈ సంవత్సరం తొలి హనుమాన్ జయంతిని ఏప్రిల్ 2, 2026 న జరుపుకున్నాం. అలాగే మే 12న మరోసారి హనుమాన్ జయంతిని జరుపుకోబోతున్నాం.

ఏడాదికి రెండు సార్లు ఎందుకు..

రామాయణం సుందరకాండలో వివరించిన ప్రకారం సీతమ్మ వారిని రావణుడు అపహరించి తీసుకెళ్లినప్పుడు.. అమ్మ జాడ కొరకు.. హనుమంతుడు లంకకు బయలుదేరుతాడు. అలా వెతుకుతూ వెతుకుతూ.. చివరకు ఓ మంగళవారం తెల్లవారుజామున అశోకవనంలో కూర్చుని ఉన్న సీతా దేవిని చూస్తాడు. ఆ రోజు చైత్రమాసం, చిత్రా నక్షత్రం, పౌర్ణమి. అయితే సీతమ్మను కనుగొన్న ఆనందంలో వాయు పుత్రుడు.. అశోక వనాన్ని ధ్వంసం చేసి.. అడ్డు వచ్చిన రావణ సేనను అంతమొందిస్తాడు.

హనుమంతుడిని కట్టడి చేయలేకపోయిన రావణ సైన్యం.. ఆంజనేయుడి తోకకు నిప్పంటించగా ఆ తోకతో హనుమంతుడు సగం లంకను దహనం చేస్తాడు. అలా హనుమంతుడు రావణ సైన్యంపై విజయం సాధించినందుకు గుర్తుగా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజును హనుమంతుని విజయోత్సవంగా జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఇది తెలియని వారు ఆ రోజును హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఇది ప్రతి ఏటా ఏప్రిల్‌లో చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు వస్తుంది.

అసలైన హనుమాన్ జయంతి ఎప్పుడంటే..

మరి అసలైన హనుమాన్ జయంతి ఎప్పుడంటే.. వైశాఖ మాసం బహుళ పక్షంలో.. దశమి తిథి నాడు.. పూర్వాభద్ర నక్షత్రం రోజున వచ్చేదే.. అసలుది. ఈ పండుగ ప్రతి సంవత్సరం మే నెల చివరిలో కానీ, జూన్ మొదటి వారంలో కానీ వస్తుంది. పురాణాల ప్రకారం ఈ రోజే అసలైన హనుమాన్ జయంతి. హనుమంతుడిపై ఉన్న ఏకైక ప్రామాణికమైన పుస్తకం పరాశర సంహితలో కూడా హనుమాన్ జయంతి ఇదే రోజని నిర్ధారించారు. కనుక ప్రతి ఏటా వైశాఖ మాసంలో వచ్చే హనుమాన్ జయంతే అసలైనది.. తప్పకుండా దాన్ని నిర్వహించుకోవాలి.

మరికొన్ని ప్రాంతాల్లో హనుమంతుడు కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున జన్మించాడని నమ్ముతారు, దీనిని ‘నరక చతుర్దశి’కి ముందు జరుపుకుంటారు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో తిథిని ప్రామాణికంగా తీసుకోవడం వల్ల హనుమాన్ జయంతి సంవత్సరానికి రెండుసార్లు వచ్చినట్లు కనిపిస్తుంది.

హనుమాన్ దీక్ష

ఈ రెండు జయంతిల మధ్య ఉన్న ప్రధాన సంబంధం ‘దీక్ష’. భక్తులు చైత్ర పౌర్ణమి (చిన్న హనుమాన్ జయంతి) రోజున హనుమాన్ దీక్షను ప్రారంభిస్తారు. ఈ దీక్ష ఒక మండలం పాటు అంటే 41 రోజుల పాటు కొనసాగుతుంది. అంటే చైత్ర పూర్ణిమ.. హనుమాన్ విజయోత్సవం నాడు దీక్షను ప్రారంభిస్తే.. సరిగ్గా 41 రోజుల తర్వాత అంటే.. వైశాఖ కృష్ణ దశమి అంటే హనుమాన్ జయంతి నాటికి పూర్తవుతుంది. కాబట్టి ఆ రోజున పెద్ద హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటూ దీక్షను విరమిస్తారు.

గమనిక : పాఠకుల ఆసక్తి మేరకు ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv నిర్ధారించడం లేదు.