Sri Rama Navami 2026 Puja : శ్రీరామ నవమి నైవేద్యంలో ఇది తప్పనిసరి.. లేదంటే మీరెన్ని పూజలు చేసిన వ్యర్థమే..!
Sri Rama Navami 2026 Puja : మార్చి 27న శ్రీరామ నవమి. మరి ఆ రోజు పాటించాల్సిన నియమాలు.. పూజా విధానం, ఏ నైవేద్యం సమర్పించాలి అనే వివరాలు..
- Dharani Pilli
- Published On : March 26, 2026 / 08:44 PM IST
sri rama navami 2026 puja shubh muhurat prasad and ritual details
Sri Rama Navami 2026 Puja : మార్చి 27 శ్రీరామనవమి. దేశమంతటా అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటారు. మరి శ్రీరామనవమి రోజు పూజ ఏ సమయంలో చేయాలి.. ఎలా చేయాలనే అంశాల గురించి పండితులు ముఖ్యమైన అంశాలను వెల్లడించారు. ఆ వివరాలు..
పూజా సమయం, తిథి వివరాలు:
ఈ ఏడాది శ్రీరామనవమిని మార్చి 27, శుక్రవారం నాడు జరుపుకోవాలి. నవమి తిథి మార్చి 26 మధ్యాహ్నం 11:48 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు (మార్చి 27) మధ్యాహ్నం వరకు ఉంటుంది. కనుక శాస్త్రం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ రోజే పండుగ జరుపుకోవాలి కాబట్టి, 27వ తేదీనే సరైనదంటున్నారు పండితులు. ఈ శ్రీరామనవమికి మరో విశేషం ఉంది. ఈసారి రాములవారు జన్మించిన పునర్వసు నక్షత్రం కూడా మార్చి 27న కలిసి వస్తోంది.
పూజా విధానం:
తెల్లవారుజామునే నిద్రలేచి, స్నానాది కార్యక్రమాలు ముగించుకుని రామ నామ స్మరణతో రోజును ప్రారంభించాలంటున్నారు పండితులు.
అభిషేకం: ఇంట్లో శ్రీరాముడి విగ్రహాలు ఉన్నవారు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో కూడిన పంచామృతంతో అభిషేకం చేస్తే మంచిది అంటున్నారు. అభిషేకం పూర్తయ్యాక అష్టోత్తరం చదువుకోవాలి.
పూజా పటాలు: ఇంట్లో శ్రీరాముడి విగ్రహాలు లేని వారు రాముడి పటాన్ని శుభ్రం చేసి, బొట్లు పెట్టి పూజించాలని చెబుతున్నారు.
తులసి ప్రాధాన్యం: శ్రీమహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతిపాత్రం. మరి ఆ విష్ణువు అవతారమైన రాముడికి కూడా తులసి అంటే చాలా ప్రీతి. అందుకే శ్రీరామనవమి నాడు తులసి మాల సమర్పించడం లేదా పూజలో తులసి దళాలను ఉపయోగించడం వల్ల స్వామి సంతోషిస్తారని చెబుతున్నారు.
పారాయణం: పూజ సమయంలో సుందరాకాండ, రామాయణం, రాముడికి సంబంధించిన స్తోత్రాలను పారాయణం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయంటున్నారు.
నైవేద్యం: స్వామి వారికి మహానివేద్యంగా వడపప్పు, పానకం, పరమాన్నం సమర్పించాలని చెబుతున్నారు.
ముఖ్య గమనిక: ఏ నైవేద్యం పెట్టినా అందులో ఒక తులసి దళం కచ్చితంగా ఉండాలి. తులసి లేని నైవేద్యాన్ని స్వామి స్వీకరించరని పురాణాలు చెబుతున్నాయంటున్నారు పండితులు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని 10tv ధృవీకరించడం లేదు.
