Ttd Temple
Tirumala Temple: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో జరగనున్న ఏర్పాట్ల కారణంగా జనవరి 11న మంగళవారం బ్రేక్ దర్శనం రద్దు అయినట్లు టీటీడీ వెల్లడించింది. స్వామి వారి ఆలయంలో జనవరి 13న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జనవరి 11న మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది.
సాధారణంగా ఏడాదికి నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఉగాది, ఆణివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల కంటే ముందుగానే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమం చేపడతారు. ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామ కోపు, శ్రీచూర్ణం, గడ్డ కర్పూరం, సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
ఇది కూడా చదవండి : లక్షల్లో మోసపోయిన అమాయకులు
బ్రేక్ దర్శనం రద్దు
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా జనవరి 11వ తేదీ మంగళవారం శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలను రద్దు అయ్యాయి. ఈ కారణంగా జనవరి 10న సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించబడవని తితిదే అధికారులు వెల్లడించారు.