Wednesday Own House Remedy : సొంతింటి కల సాకారం కావాలంటే.. బుధవారం నాడు కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పులతో ఇలా చేయండి..!
Wednesday Own House Remedy : సొంతింటి కల సాకారంలో అవాంతరాలు ఎదురవుతున్నాయా.. అలాంటి వారి కోసమే ఈ పరిహారం
- Dharani Pilli
- Updated on- May 26, 2026 / 09:57 PM IST
Wednesday Astrology Remedies To Fulfill your dream house with lentils dals
Wednesday Own House Remedy : ప్రతి మనిషికి ఉండే ముఖ్యమైన కోరికల్లో సొంతిల్లు నిర్మాణం కూడా ఒకటి. చనిపోయేలోగా తమకంటూ సొంతంగా ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. అయితే అందరి విషయంలో ఆ కోరిక నెరవేరకపోవచ్చు. ఇల్లు కట్టుకోలేని వాళ్లు.. స్థలం ఉన్నా కూడా ఇల్లు కట్టుకోలేని వాళ్లు.. ఇల్లు కొనుక్కోలేని వాళ్లు, వంశపారంపర్యంగా ఇల్లు వచ్చినా సరే అవి నష్టపోయిన వాళ్లు.. సొంత ఇల్లు ఉన్నా సరే ఆ ఇంట్లో ఉండలేక అద్దె ఇంట్లో ఉంటున్న వాళ్లు ఎందరో ఉంటారు. అయితే ఈ సమస్యకు ప్రధాన కారణం ఏంటంటే.. ‘భవన దోషం’ అంటున్నారు పండితులు.
భవన దోషం వల్ల ఇంటి నిర్మాణం విషయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారని పండితులు చెబుతున్నారు. మరి ఈ భవన దోషం పోవాలంటే ఏం చేయాలి.. ఏ రోజు ఎలాంటి పరిహారం పాటిస్తే.. ఇంటి నిర్మాణంలో ఎదురయ్యే సమస్యలు, ఆటంకాలు తీరిపోయి.. తమ కల నెరవేర్చుకుంటారు అనే దానికి సంబంధించి పండితులు ఒక అద్భుతమైన పరిహారం చెబుతున్నారు. పైగా దీనికి రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మన వంటింట్లో ఉండే పలు రకాల పప్పులతోనే ఈ పరిహారం చేయవచ్చు.
ఇంటి నిర్మాణంలో ఆటంకాలు కలిగించే భవన దోషం తొలగించుకునేందుకు పరిహార శాస్త్రంలో ఒక అద్భుతమైన మార్గం చెప్పారు. ఆ పరిహారం ఏంటంటే.. కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పులను సమపాళ్లలో (సమాన పరిమాణంలో) తీసుకోవాలి. ఆ తర్వాత వాటిని విడివిడిగా మరపట్టించి పిండి లాగా చేసుకోవాలి. ఆపై సమాన పరిమాణంలో ఈ మూడు పిండ్లను తీసుకుని కలపాలి. కలిపిన తర్వాత ఆ పిండి మిశ్రమంలో నీళ్లు పోసి ముద్దగా చేసి.. దాన్ని 11 చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి.
అలా తయారు చేసుకున్న ఆ 11 చిన్న చిన్న పిండి ఉండల మీద బెల్లం ముక్కలు ఉంచాలి. ఆ తర్వాత ఆ 11 ఉండలను బుధవారం పూట గోవుకి (ఆవుకి) ఆహారంగా తినిపించాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే భవన దోషం అనేది తొలగిపోతుంది. దీనివల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇంటి నిర్మాణం పూర్తవుతుందని పండితులు చెబుతున్నారు.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv ధ్రువీకరించడం లేదు.
