Ajinkya Rahane : ఆస్ట్రేలియాను అడగాల్సిన పని లేదు.. కామెరూన్ గ్రీన్ బౌలింగ్ చేయకపోవడంపై స్పందించిన రహానే
గుజరాత్ చేతిలో ఓడిపోవడం నిరాశను కలిగించిందని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే (Ajinkya Rahane) తెలిపాడు.
- Thota Vamshi Kumar
- Updated on- April 18, 2026 / 08:46 AM IST
Ajinkya Rahane intresting comments after Kolkata Knight Riders lost match to Gujarat Titans (pic credit@ipl)
- గుజరాత్ చేతిలో ఓడిన కేకేఆర్
- ఈ సీజన్‌లో ఐదో ఓటమి
- ఎంతో నిరాశ కలిగించిందన్న అజింక్యా రహానే
Ajinkya Rahane : ఐపీఎల్ 2026 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కు ఏదీ కలిసి రావడం లేదు. వరుస పరాజయాలతో సతమతమవుతోంది. శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ సీజన్‌లో కేకేఆర్‌కు ఇది ఐదో ఓటమి కావడం గమనార్హం. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడిపోవడం నిరాశను కలిగించిందని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. కేకేఆర్ బ్యాటర్లలో కామెరూన్ గ్రీన్ (79; 55 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. జీటీ బౌలర్లలో కగిసో రబాడ మూడు, సిరాజ్, అశోక్ శర్మలు చెరో రెండు వికెట్లు తీశారు. ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
also read : ఇదేం వింత సామీ.. గెలిచినా కూడా సంతోషంగా లేవా.. శుభ్‌మన్ గిల్ ఆసక్తికర కామెంట్స్..
ఆ తరువాత 181 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ జట్టు 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. జీటీ బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (86; 50 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల) రాణించాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి రెండు, వైభవ్ అరోరా, సునీల్ నరైన్, రమణ్‌దీప్ సింగ్ లు తలా ఓ వికెట్ తీశారు.
సానుకూల అంశాలే మాట్లాడుతా..
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే స్పందించాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే ఓటమిపై మాట్లాడడం మానసిక ఒత్తిడితో కూడుకున్నది అని చెప్పుకొచ్చాడు. తాను సానుకూల అంశాలనే మాట్లాడాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును కామెరూన్ గ్రీన్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడని తెలిపాడు. అతడు ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నాడు.
147 పరుగులకే సగం వికెట్లు కోల్పోయినప్పటికి కూడా 180 పరుగులు చేయడం తమ బ్యాటింగ్ యూనిట్ గొప్పతనం అని చెప్పాడు. ఇక బౌలర్ల పైనా ప్రశంసల వర్షం కురిపించాడు. వారు అద్భుతంగా బౌలింగ్ చేశారని, వారు మ్యాచ్ ను చివరి ఓవర్ వరకు తీసుకువెళ్లారని చెప్పాడు. మైదానంలో మంచు ఉన్నప్పటికి దాన్ని సాకుగా చూపించడం లేదన్నాడు. ఏదీఏమైనప్పటికి కూడా పవర్ ప్లేలో తమ బౌలర్లు వికెట్లు పడగొట్టడంలో విఫలం అయ్యారని చెప్పాడు. ఒకవేళ పవర్ ప్లేలోనే సాధ్యమైనన్ని వికెట్లు తీసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిఫ్రాయపడ్డాడు. 180 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవచ్చునని తెలిపాడు.
గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లు చాలా బాగా ఆడారన్నాడు. వారిద్దరు పవర్ ప్లేలో ఎలాంటి వికెట్ ఇవ్వకుండా మ్యాచ్‌ను తమ నుంచి లాగేసుకున్నారని తెలిపాడు. ఇక కామెరూన్ గ్రీన్ ఎందుకు బౌలింగ్ చేయలేదు అన్న విషయం పై మాట్లాడుతూ.. అతడు కండరాల నొప్పితో బాధపడుతున్నాడని చెప్పుకొచ్చాడు. అందుకనే అతడు ఫీల్డింగ్ సమయంలో మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకున్నాడని తెలిపాడు. ఈ క్రమంలోనే అతడితో బౌలింగ్ చేయించి రిస్క్ తీసుకోదలుచుకోలేదన్నాడు. ఏదీ ఏమైనప్పటికి కూడా గ్రీన్ బ్యాటింగ్‌లో ఫామ్‌లోకి రావడం బాగుందన్నాడు.
ఈ సీజన్‌లో తమ జట్టు వరుస ఓటముల గురించి మట్లాడుతూ.. తమ నియంత్రణలో లేని విషయాల గురించి అతిగా ఆలోచించడం లేదన్నడు. ప్రస్తుత క్షణంలోనే ఉండడం ముఖ్యమన్నాడు. మైదానంలోకి వెళ్లి ఆటను ఆస్వాదించాలని, ఓ జట్టుగా ఒకరినొకరం ప్రోత్సహించుకోవడం ముఖ్యమన్నాడు.
