Vaibhav Sooryavanshi : మాపై ఒత్తిడి తెచ్చాడు.. మరో మార్గం లేకపోయింది.. వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేయడం పై అజిత్ అగార్కర్ కామెంట్స్..
వైభవ్ సూర్యవంశీని (Vaibhav Sooryavanshi) టీమ్ఇండియాలోకి తీసుకోవడంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- June 7, 2026 / 10:58 AM IST
Ajit Agarkar comments on Vaibhav Sooryavanshi picking on team india
- టీమ్ఇండియాలో చోటు దక్కించుకున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ
- చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కామెంట్స్
Vaibhav Sooryavanshi : విధ్వంసకర విన్యాసాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ టీమ్ఇండియాలో చోటు సంపాదించుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌లతో జరగబోయే టీ20 సిరీస్‌లతో పాటు సెప్టెంబర్‌లో జరిగే ఆసియా గేమ్స్ కోసం ప్రకటించిన భారత జాతీయ జట్టులో అతడికి చోటు దక్కింది. ఈ క్రమంలో టీమ్ఇండియాకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడైన ప్లేయర్‌గా వైభవ్ రికార్డులకు ఎక్కాడు. కాగా.. అతడిని ఎంపిక చేయడం తప్ప సెలక్షన్ కమిటీకి మరో మార్గం లేకపోయిందని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు.
ఐర్లాండ్, ఇంగ్లాండ్, ఆసియా గేమ్స్‌కు జట్టును ప్రకటించిన సందర్భంగా అజిత్ అగార్కర్ మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీపై అతడు ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు తన ఆటతో జాతీయ జట్టులోని తీసుకునేలా తమపై ఒత్తిడి తెచ్చాడని తెలిపాడు.
అతడు ఏం చేయగలడమో మనం అంతా చూశాం. ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్ రాయల్స్‌ను ఒంటి చేత్తో ముందుకు నడిపించాడు. ఒత్తిడిలోనూ అతడు ఎంతో చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సీజన్‌లోనే కాదు గత ఐపీఎల్ సీజన్‌లోనూ అతడు తనదైన ముద్ర వేశాడు. ఐపీఎల్ లాంటి తీవ్రమైన పోటీ, అధిక ఒత్తిడి ఉండే టోర్నమెంట్‌లో తాను ఎలా బ్యాటింగ్ చేయగలడో చూపించాడు. అతడు ఒంటి చేత్తో మ్యాచ్ గమనాన్ని మార్చగలడు. విధ్వంసకర ప్లేయర్. అతడిపై మేము పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడని ఆశిస్తున్నాం. అని అగార్కర్ అన్నాడు.
అతడు ఎంత చిన్నవాడో మాకు తెలుసు. అయితే.. అతడు తన అద్భుతమైన ఆటతీరుతో ఎంపిక చేసేలా ఒత్తిడి తీసుకువచ్చాడు. అతడిలో ఎంతో ప్రతిభ ఉంది. దేశం కోసం ఆడేటప్పుడు అతడు తన పూర్తి శక్తి సామర్థ్యాలతో ఆడతాడని భావిస్తున్నాం. అని అగార్కర్ చెప్పాడు.
ఐర్లాండ్ పై అరంగ్రేటం..!
భారత జట్టు రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం తొలుత ఐర్లాండ్‌లో పర్యటించనుంది. జూన్ 26న తొలి టీ20 మ్యాచ్, జూన్ 28న రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ల్లో వైభవ్ సూర్యవంశీ అరంగ్రేటం చేసే అవకాశం ఉంది. అదే జరిగితే భారత జట్టు తరుపున అరంగ్రేటం చేసిన అతి పిన్న వయస్కుడైన ప్లేయర్‌గా అతడు చరిత్ర సృష్టిస్తాడు.
