IND -W vs SL -W : స్వర్ణ పతక మ్యాచ్‌లో దంచికొట్టిన భారత బ్యాటర్లు.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం..
ఆసియా క్రీడలు 2026 ఫైనల్ మ్యాచ్‌లో బ్యాటర్లు రాణించడంతో శ్రీలంక ముందు భారత మహిళల జట్టు (IND -W vs SL -W )భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
- Thota Vamshi Kumar
- Updated on- September 22, 2026 / 12:27 PM IST
Asian Games 2026 final Smriti Mandhana half century helps team team 216 in 20 overs
IND -W vs SL -W : జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడ్లలో భాగంగా మహిళల క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. బ్యాటర్లు విజృంభించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక ముందు 217 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది.
టీమ్ఇండియా బ్యాటర్లలో స్మృతి మంధాన (79; 45 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేసింది. షఫాలీ వర్మ (48; 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో అర్థశతకాన్ని చేజార్చుకుంది. ఆఖరిలో రిచా ఘోష్ (49 నాటౌట్ ; 22 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ఆడింది.
Innings Break!#TeamIndia put up the highest-ever total in women’s cricket at the #AsianGames 💥
Over to our bowlers in the Gold Medal match 👌
Scorecard ▶️ https://t.co/x367kJHmrc pic.twitter.com/F9yXv49dWz
— BCCI Women (@BCCIWomen) September 22, 2026
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మలు శుభారంభాన్ని అందించారు. లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. పోటాపోటీగా బౌండరీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. తొలి వికెట్‌కు సరిగ్గా 10 ఓవర్లలో 99 పరుగులు జోడించారు. స్మృతి మంధాన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా అదే ఓవర్‌లో ఆఖరి బంతిని అర్థశతకానికి రెండు పరుగుల దూరంలో షఫాలీ వర్మ పెవిలియన్‌కు చేరుకుంది.
కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (19; 17 బంతుల్లో 3 ఫోర్లు) విఫలమైంది. అయినప్పటికి రిచా ఘోష్‌తో కలిసి స్మృతి మంధాన ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. వేగంగా ఆడే క్రమంలో మంధాన ఔటైనా.. ఆఖరిలో రిచా వేగంగా ఆడడంతో స్కోరు 200 పరుగులు దాటింది.
