IND vs SL : విశాఖలో చివరిసారి ఆడనున్న రోహిత్, కోహ్లీ.. డిసెంబర్ 13న భారత్ వర్సెస్ శ్రీలంక తొలి వన్డే..
డిసెంబర్ 13 భారత్, శ్రీలంక జట్ల మధ్య (IND vs SL) విశాఖ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది.
- Thota Vamshi Kumar
- Updated on- November 6, 2026 / 11:10 AM IST
BCCI Shifts India vs Sri Lanka 1st ODI From Delhi To Visakhapatnam
IND vs SL : ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులకు శుభవార్త. టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ప్రత్యక్షంగా చూసే సువర్ణావకాశం వచ్చింది. భారత్, శ్రీలంక జట్ల మధ్య డిసెంబర్ 13న జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ వేదిక మారింది. తొలుత ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. ప్రతికూల వాతావరణ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండటంతో పాటు స్టేడియంలో పునరుద్ధరణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో వేదికను విశాఖపట్నానికి మార్చారు. ఈ విషయాన్ని బీసీసీఐ వెల్లడించింది.
దేశ రాజధాని ఢిల్లీలో సాధారణంగా వాయు కాలుష్యం అధికంగా ఉంటుంది. దీనికి తోడు అరుణ్ జైట్లీ స్టేడియంలో ఔట్‌ఫీల్డ్‌ను కొత్తగా సిద్ధం చేసే పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావించిన ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) వేదికను మార్చాలని బీసీసీఐని కోరింది.
IPL : 40 కోట్ల ఇస్తేనే జట్టులో ఉంటాం.. లేదంటే.. ఫ్రాంఛైజీలకు షాకిస్తున్న స్టార్ ఆటగాళ్లు..
ఈ అభ్యర్థనను పరిశీలించిన బీసీసీఐ మ్యాచ్ వేదికను విశాఖపట్నానికి మారుస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 13న జరగనున్న తొలి వన్డే మ్యాచ్ విశాఖపట్నంలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. విశాఖలో మ్యాచ్ జరగనుందనే వార్త తెలిసి ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
విశాఖ వేదికగా రో-కోకు చివరి మ్యాచ్?
వైజాగ్ వేదికగా రోహిత్, కోహ్లీలకు ఇదే చివరి మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో టీ20లు, టెస్ట్‌లకు వీరిద్దరు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇద్దరూ వన్డేలు మాత్రమే ఆడుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా.. వన్డే ప్రపంచకప్ 2027కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇక 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత రో-కో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో.. ఈ మెగా టోర్నీకి ముందు వైజాగ్ వేదికగా జరిగే ఏకైక వన్డే మ్యాచ్ కూడా ఇదే.
మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల కోసం శ్రీలంక జట్టు భారత పర్యటనకు రానుంది. తొలుత వన్డే, ఆ తరువాత టీ20 సిరీస్‌లు జరగనున్నాయి. వన్డే సిరీస్ డిసెంబర్ 13 నుంచి టీ20 సిరీస్ డిసెంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.
