Bhuvneshwar Kumar : న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌.. భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ను ఊరిస్తున్న భారీ మైలురాళ్లు..

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ఇండియా పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ను (Bhuvneshwar Kumar) భారీ మైలురాళ్లు ఊరిస్తున్నాయి.

Bhuvneshwar Kumar On Cusp Of Two Big Milestones Ahead Of New Zealand T20Is

Bhuvneshwar Kumar : భార‌త్, న్యూజిలాండ్ జట్ల మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ గురువారం (అక్టోబ‌ర్ 22) నుంచి ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో అంద‌రి దృష్టి స్వింగ్ కింగ్‌ భువ‌నేశ్వ‌ర్ కుమార్ పైనే ఉంది. నాలుగేళ్ల త‌రువాత వెస్టిండీస్‌తో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన ఐదో టీ20 మ్యాచ్ ద్వారా అత‌డు రీఎంట్రీ ఇచ్చాడు. అయితే.. ఈ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయిన సంగ‌తి తెలిసిందే. కాగా.. పేస్‌, స్వింగ్‌కు అనుకూలించే కివీస్ పిచ్‌ల‌పై భువీ ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న ఇస్తాడోన‌ని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా.. ఈ న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ను రెండు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి.

100 వికెట్ల క్ల‌బ్‌లో..

2012లో అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ అరంగ్రేటం చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు 88 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 6.96 ఎకాన‌మీతో 90 వికెట్లు తీశాడు. ఇందులో 5 వికెట్ల ఘ‌న‌త రెండు సార్లు సాధించ‌గా నాలుగు వికెట్ల ఘ‌న‌త మూడు సార్లు న‌మోదు చేశాడు. కివీస్‌తో సిరీస్‌లో అత‌డు 10 వికెట్లు తీస్తే.. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు. ఈ ఘ‌న‌త సాధించిన ఐదో భార‌త బౌల‌ర్‌గా రికార్డుల‌కు ఎక్క‌నున్నాడు.

Harmanpreet Kaur : జింబాబ్వేతో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌.. కన్నీళ్లు పెట్టుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్.. వీడియో వైరల్

అర్ష్‌దీప్ సింగ్‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అక్ష‌ర్ ప‌టేల్‌లు మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్ త‌రుపున టీ20ల్లో వంద వికెట్ల క్ల‌బ్‌లో ఉన్నారు.

భార‌త్ త‌రుపున 100 వికెట్లు తీసిన బౌల‌ర్లు వీరే..

* అర్ష్‌దీప్ సింగ్ – 99 మ్యాచ్‌ల్లో 145 వికెట్లు
* జ‌స్‌ప్రీత్ బుమ్రా – 100 మ్యాచ్‌ల్లో 126 వికెట్లు
* హార్దిక్ పాండ్యా – 138 మ్యాచ్‌ల్లో 114 వికెట్లు
* అక్ష‌ర్ ప‌టేల్ – 112 మ్యాచ్‌ల్లో 113 వికెట్లు

300 వికెట్లు..

2012లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన భువీ ఇప్ప‌టి వ‌ర‌కు 21 టెస్టులు, 121 వ‌న్డేలు, 88 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 63, వ‌న్డేల్లో 141, టీ20ల్లో 90 వికెట్లు సాధించాడు. ఈ క్ర‌మంలో మూడు ఫార్మాట్ల‌లో క‌లిపి 294 వికెట్లు సాధించాడు. కివీస్‌తో సిరీస్‌లో ఆరు వికెట్లు తీస్తే.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 300 వికెట్ల క్ల‌బ్‌లో చేరుతాడు. ఈ ఘ‌న‌త సాధించిన 14వ భార‌త బౌల‌ర్‌గా, తొమ్మిదో పేస‌ర్‌గా అత‌డు నిలుస్తాడు.