Shikhar Dhawan Representative Image (Image Credit To Original Source)
Shikhar Dhawan: మాజీ భార్య ఆయేషా ముఖర్జీపై న్యాయ పోరాటంలో భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కు బిగ్ రిలీఫ్ లభించింది. ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. భరణం కింద చెల్లించిన రూ.5.7 కోట్లను శిఖర్ ధావన్‌కు తిరిగి ఇచ్చేయాలని ఆయేషాను కోర్టు ఆదేశించింది.
శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీకి 2012లో వివాహమైంది. 2023లో విడాకులు తీసుకున్నారు. ఆయేషాకు ఆస్ట్రేలియా పౌరసత్వం ఉంది. అక్కడి కోర్టులో ప్రాపర్టీ సెటిల్‌మెంట్ కోసం పిటిషన్ దాఖలు చేసింది. ఆస్ట్రేలియా దేశ చట్టాల ప్రకారం విడాకుల తర్వాత భార్య భర్తల మధ్య ఆస్తుల పంపిణీ జరగాలి. ఈ నిబంధన కింద ధావన్ తన మాజీ భార్యకు రూ. 5.72 కోట్లు బదిలీ చేయాల్సి వచ్చింది.
అయితే ఆస్ట్రేలియా ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పు భారత్‌లో చెల్లుబాటు కాదని ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది. ఆస్ట్రేలియాలో ఉన్న ప్రాపర్టీ సెటిల్‌మెంట్ భారత న్యాయ వ్యవస్థకు, హిందూ వివాహ చట్టానికి పూర్తిగా విరుద్ధమని పేర్కొంది. భారత చట్టాల్లో ఇలాంటి ఆస్తి పంపిణీకి ఎలాంటి నిబంధనలు లేవని తేల్చి చెప్పింది న్యాయస్థానం. ఈ కారణంగా ఆస్ట్రేలియా కోర్టు తీర్పు ఇక్కడ చెల్లదంటూ.. ఆయేషా ముఖర్జీ ఆ డబ్బును తిరిగి ధావన్‌కు చెల్లించాలని ఆదేశించారు న్యాయమూర్తి.
ధావన్ కెరీర్‌ను నాశనం చేస్తానని, తప్పుడు ఆరోపణలతో పరువు తీస్తానని ఆయేషా బెదిరించినట్లుగా కోర్టు గుర్తించింది. మోసపూరిత పద్ధతుల్లో ధావన్ నుంచి సెటిల్‌మెంట్ పత్రాలపై సంతకాలు తీసుకున్నట్లు నిర్ధారించింది. ఈ క్రమంలోనే ఆ పత్రాలన్నీ చెల్లవని ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది.
తనకంటే పదేళ్లు పెద్దదైన ఆయేషా ముఖర్జీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు శిఖర్ ధావన్. 2014లో వీరికి కొడుకు (జోరావర్) కూడా పుట్టాడు. తొమ్మిదేళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో ఆ తర్వాత కలహాలు మొదలయ్యాయి. 2021 లో విడిపోయారు. 2023లో అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి.
కాగా, తన కొడుకుని తనకు దూరంగా ఉంచి ఆయేషా ముఖర్జీ తనను మానసిక వేదనకు గురి చేసిందని విడాకుల కేసు సమయంలో కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు శిఖర్ ధావన్. దీన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది.
ఆస్ట్రేలియా చట్టం ప్రకారం భరణం కింద రూ.5.72 కోట్ల విలువైన ఆస్తులను తన మాజీ భార్యకు బదిలీ చేశాడు ధావన్. అయితే ఆస్ట్రేలియా చట్టాలు భారత్ లో చెల్లవని.. ఇలా జరిగిన ఆస్తుల బదిలీ చెల్లదని చెప్పిన ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు.. ధావన్ నుంచి తీసుకున్న ఆ ఆస్తులను తిరిగి అతనికి ఇచ్చేయాలని తీర్పు చెప్పింది. ఇక ఇటీవలే తన స్నేహితురాలు సోఫీ షైన్‌ని రెండో వివాహం చేసుకున్నాడు శిఖర్ ధావన్.
Also Read: టీ అమ్మే వ్యక్తి కొడుకు సక్సెస్ స్టోరీ.. పేదరికాన్ని జయించి ఐఏఎస్ ఆఫీసర్ అయిన వైనం